నిరుపయోగంగా ఉన్న బావికి పునర్వైభవం
పరిశుభ్రం చేసి వినియోగంలోకి తెస్తాం
ఇనుగుర్తి సర్పంచ్ తమ్మడపల్లి కుమార్
కాకతీయ, ఇనుగుర్తి: గ్రామంలోని పాత మంచినీటి బావిని శుభ్రం చేసి తిరిగి ప్రజల వినియోగంలోకి తీసుకువస్తామని ఇనుగుర్తి సర్పంచ్ తమ్మడపల్లి కుమార్ తెలిపారు. గ్రామ పంచాయతీ కార్యాలయం ముందున్న బజార్లో నిరుపయోగంగా ఉన్న ఈ బావిని పూడ్చివేయాలని గతంలో ఒక వ్యక్తి కలెక్టర్కు ఫిర్యాదు చేశారు. ఎంపీడీఓ పార్థసారథి ఆదేశాల మేరకు బుధవారం సర్పంచ్, పంచాయతీ కార్యదర్శి విజయలక్ష్మి మరియు పాలక మండలి సభ్యులు బావిని క్షేత్రస్థాయిలో పరిశీలించారు.
తీర్మానం మేరకు పునరుద్ధరణ..
ఈ సందర్భంగా సర్పంచ్ మాట్లాడుతూ.. బావిలో నీటి ఊట సమృద్ధిగా ఉందని, కట్టడం కూడా పటిష్టంగా ఉందని పేర్కొన్నారు. దీన్ని పూడ్చివేయకుండా, బావిలోని చెత్తను తొలగించి శుద్ధి చేయాలని పాలక మండలి తీర్మానించినట్లు వెల్లడించారు. రక్షణ కోసం బావి చుట్టూ గ్రిల్స్ ఏర్పాటు చేసి, కొత్తగా 5 హెచ్పీ మోటార్ బిగించి ప్రజల తాగునీటి అవసరాలకు వినియోగిస్తామన్నారు. ఈ కార్యక్రమంలో పంచాయతీ కార్యదర్శి విజయలక్ష్మి, వార్డు సభ్యులు దేవులపల్లి వెంకన్న, వేముల శ్రీనివాస్, బూర ఇస్తారి, ప్రశాంత్, పరుశరామ్, రమ, అనూష, సరిత, నూర్జహాన్, కరోబార్ మధు తదితరులు పాల్గొన్నారు.

