టెన్త్ ఫలితాల్లో ‘మాస్టర్ జీ’ ప్రభంజనం
580 మార్కులతో టాప్‌లో నిలిచిన కుంభ శ్రేష్టి నిధి
550 పైగా మార్కులతో 29 మంది విద్యార్థుల సత్తా
విజేతలను అభినందించిన చైర్మన్ సుందర్ రాజ్ యాదవ్
కాకతీయ, హన్మకొండ : పదవ తరగతి ఫలితాల్లో మాస్టర్ జీ గ్రూప్ ఆఫ్ స్కూల్స్ విద్యార్థులు అద్భుత ప్రతిభ కనబరిచి, ఉమ్మడి వరంగల్ జిల్లాలోనే మేటిగా నిలిచారు. పాఠశాల విద్యార్థులు సాధించిన ఈ అసాధారణ విజయంతో అటు మేనేజ్మెంట్, ఇటు అధ్యాపక బృందంలో హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి. ఈ ఫలితాల్లో కుంభ శ్రేష్టి నిధి 580 మార్కులతో ప్రథమ స్థానంలో నిలిచి పాఠశాల కీర్తిని చాటారు. మిగిలిన ప్రతిభావంతుల్లో సయ్యద్ బుష్రా లోరీన్ (579), దీక్షా గంగోత్రి (575), ఉమ్మె హబీబా (574), చిలగాని లాస్య (573), ఉప్పు గీతిక (572), సోమ హన్సిక (567), జీ. శ్రీశాంత్ రెడ్డి (567), శ్రీలయ (566) మార్కులు సాధించి సత్తా చాటారు. మొత్తం 146 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరుకాగా, ఏకంగా 29 మంది 550 పైగా మార్కులు, 87 మంది విద్యార్థులు 500 పైచిలుకు మార్కులు సాధించి రికార్డు సృష్టించారు.

నాణ్యమైన బోధనకు నిదర్శనం..
విద్యార్థుల అంకితభావం, ఉపాధ్యాయుల నిరంతర కృషి వల్లే ఈ అద్భుత మార్కులు సాధ్యమయ్యాయని మాస్టర్ జీ విద్యాసంస్థల చైర్మన్ సుందర్ రాజ్ యాదవ్ పేర్కొన్నారు. పాఠశాలలో అందిస్తున్న నాణ్యమైన విద్యాబోధనకు ఈ ఫలితాలే నిదర్శనమని ఆయన అన్నారు. విద్యార్థులను, వారికి వెన్నుదన్నుగా నిలిచిన తల్లిదండ్రులను ఆయన ప్రత్యేకంగా అభినందించారు. భవిష్యత్తులోనూ ఇదే తరహా విద్యా ప్రమాణాలను పాటిస్తూ విద్యార్థుల ఉజ్వల భవిష్యత్తుకు బాటలు వేస్తామని ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా పాఠశాల సిబ్బంది మిఠాయిలు పంపిణీ చేసి సంబరాలు జరుపుకున్నారు.

