అగ్నికి ఆహుతి.. ప్రకృతి వనం ఖాళీ
అధికారుల నిర్లక్ష్యమే కారణమని గ్రామస్తుల ఆరోపణ
ఇందుర్తిలో ప్రకృతి సంపద నాశనం
కాకతీయ, చిగురుమామిడి: చిగురుమామిడి మండల పరిధిలోని ఇందుర్తి గ్రామ ప్రకృతి వనంలో జరిగిన అగ్ని ప్రమాదం స్థానికంగా ఆందోళన కలిగిస్తోంది. అధికారుల పర్యవేక్షణ లోపం వల్ల విలువైన ప్రకృతి సంపద అగ్నికి ఆహుతైందని గ్రామ ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. వనాల్లో పెరిగిన ఎండు గడ్డిని సమయానుకూలంగా తొలగించకపోవడం, మొక్కలకు తగినంత నీటి సౌకర్యం కల్పించకపోవడం వల్లే ఈ ప్రమాదం సంభవించిందని గ్రామస్తులు ఆరోపిస్తున్నారు. గ్రామ పంచాయతీ కార్యదర్శి, ఫీల్డ్ అసిస్టెంట్ నిర్లక్ష్యం కారణంగానే ప్రకృతి వనం పాడైపోయిందని ఆవేదన వ్యక్తం చేశారు.విధుల పట్ల బాధ్యతారాహిత్యంగా వ్యవహరించిన కార్యదర్శి, ఫీల్డ్ అసిస్టెంట్‌పై ఉన్నతాధికారులు తక్షణమే చర్యలు తీసుకోవాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు. అవసరమైతే వారిని విధుల నుంచి తొలగించాలని, భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా వనాల సంరక్షణకు పటిష్ట చర్యలు చేపట్టాలని కోరారు.

