జర్నలిస్టులకు ఇళ్ల స్థలాలు
: మంత్రి పొంగులేటి కీలక ప్రకటన
హైదరాబాద్లో అర్హులైన వారందరికీ అవకాశం
జూన్ 2న అధికారిక ప్రకటన వెలువడే ఛాన్స్
న్యాయపరమైన చిక్కుల్లేకుండా టౌన్ షిప్ ఏర్పాటుకు ప్రభుత్వం మొగ్గు
కాకతీయ, హైదరాబాద్ : రాష్ట్రంలోని అర్హులైన జర్నలిస్టులందరికీ హైదరాబాద్లో ఇళ్ల స్థలాలు కేటాయించేందుకు ప్రభుత్వం సానుకూలంగా ఉందని మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి తెలిపారు. జర్నలిస్టుల సంక్షేమానికి తమ ప్రభుత్వం కట్టుబడి ఉందని, దీర్ఘకాలంగా పెండింగ్లో ఉన్న ఇళ్ల స్థలాల సమస్యను పరిష్కరించేందుకు సిద్ధంగా ఉన్నామని ఆయన స్పష్టం చేశారు. ఈరోజు హైదరాబాద్ లోని వివిధ జర్నలిస్ట్ హౌసింగ్ సొసైటీల ప్రతినిధులతో జరిగిన సమావేశంలో మంత్రి ఈ కీలక విషయాలను వెల్లడించారు.
కమిటీ ఏర్పాటు.. వివరాల సేకరణ
జర్నలిస్టులందరూ ఒకే మాట మీదకు రావడం శుభ పరిణామన్న మంత్రి, అన్నీ అంశాలను పరిశీలించి తగిన నిర్ణయాలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. ఈ సమస్య పరిష్కారానికి సమాచార కమిషనర్ నేతృత్వంలో ఒక కమిటీని ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. సొసైటీల ప్రతినిధులతో కలిపి 10 మందికి మించకుండా ఈ కమిటీని ఏర్పాటు చేసుకుని, అర్హులైన జర్నలిస్టులందరి వివరాలను కమిషనర్ ఆధ్వర్యంలోని సభ్యులకు అందజేయాలని సూచించారు.
టౌన్ షిప్ ఏర్పాటు పై ఆలోచన
ప్రజా ప్రతినిధులు, బ్యూరోక్రాట్లు, జర్నలిస్టులకు అందరికీ కలిపి ఒకేచోట ఒక భారీ టౌన్ షిప్ ఏర్పాటు చేయాలనేది ప్రభుత్వ ఆలోచన అని మంత్రి వెల్లడించారు. న్యాయపరమైన చిక్కులు లేకుండా, గతంలో ఎదురైన ఇబ్బందులను దృష్టిలో ఉంచుకుని కేటాయింపులు జరపాలనేది ప్రభుత్వ విధానమని ఆయన స్పష్టం చేశారు. కేటాయింపు ధర విషయంలో జర్నలిస్టులకు ఎటువంటి ఇబ్బంది ఉండదని ఆయన హామీ ఇచ్చారు.
అర్హత నిబంధనలు.. పనుల వేగం
హైదరాబాద్లో కనీసం పది సంవత్సరాలు పనిచేసిన జర్నలిస్టులకు, ప్రభుత్వం అలాట్ చేసే నాటికి అర్హులైన వారందరికీ ఇళ్ల స్థలాలు ఇవ్వాలని నిర్ణయించినట్లు మంత్రి తెలిపారు. సొసైటీల పేరుతో గతంలో ఇచ్చిన మాదిరిగా కాకుండా, సొసైటీలోని సభ్యులతో ఆయా సొసైటీలు జాబితా తయారు చేసి కమిటీకి ఇవ్వాలని, వాటిని సమాచార కమిషనర్ పరిశీలిస్తారని ఆయన వివరించారు. ఈ రోజు నుంచే సొసైటీ పనుల వేగం పెంచాలని మంత్రి కోరారు.
ఈ సమావేశంలో మీడియా అకాడమీ ఛైర్మన్ కె. శ్రీనివాస్ రెడ్డి, సమాచార శాఖ కమిషనర్ ముకుంద రెడ్డితో పాటు వివిధ హౌసింగ్ సొసైటీల ప్రతినిధులు పాల్గొన్నారు. జూన్ 2వ తేదీన తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా జర్నలిస్టుల ఇళ్ల స్థలాల కేటాయింపుపై అధికారిక ప్రకటన వెలువడే అవకాశం ఉందని సమాచారం.

