ఉప్పల్ సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో లంచాల పర్వం
డాక్యుమెంట్ రైటర్ల ద్వారా అదనపు వసూళ్లు?
ఒక్కో రిజిస్ట్రేషన్‌కు రూ.5 వేల వరకు వసూలు
తెలంగాణ రియల్టర్స్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు ప్రవీణ్‌కుమార్ ఆరోపణలు
అవినీతిపై సమగ్ర విచారణ జరపాలని డిమాండ్
కాకతీయ, ఉప్పల్ : ఉప్పల్ సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో ఆస్తుల రిజిస్ట్రేషన్ల పేరుతో అదనపు వసూళ్లు జరుగుతున్నాయంటూ తెలంగాణ రియల్టర్స్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు నారగోని ప్రవీణ్‌కుమార్ సంచలన ఆరోపణలు చేశారు. ఆస్తి రిజిస్ట్రేషన్‌కు అవసరమైన అన్ని పత్రాలు సక్రమంగా ఉన్నప్పటికీ డాక్యుమెంట్ రైటర్ల ద్వారా అదనంగా డబ్బులు వసూలు చేస్తున్నారని ఆయన పేర్కొన్నారు. ఒక్కో రిజిస్ట్రేషన్‌కు రూ.2 వేల నుంచి రూ.5 వేల వరకు అదనంగా తీసుకుంటున్నారని ఆరోపించారు. ఉప్పల్ సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో రోజుకు రూ.3 లక్షల నుంచి రూ.10 లక్షల వరకు లంచాల రూపంలో వసూళ్లు జరుగుతున్నాయన్న ఆరోపణలపై సమగ్ర విచారణ జరపాలని డిమాండ్ చేశారు. రిజిస్ట్రేషన్‌కు సంబంధించిన ప్రక్రియలో డాక్యుమెంట్ రైటర్ల ద్వారా అదనపు మొత్తాలను వసూలు చేస్తున్నారని ప్రవీణ్‌కుమార్ ఆరోపించారు. ఈ వ్యవహారం వెనుక కార్యాలయ స్థాయిలో ఎవరి వాటా ఎంత ఉందన్న విషయాన్ని విచారణ ద్వారా తేల్చాలని కోరారు. జిల్లా రిజిస్ట్రార్‌తో పాటు స్టాంపులు, రిజిస్ట్రేషన్ల శాఖ ఉన్నతాధికారుల స్థాయిలోనూ దర్యాప్తు చేపట్టాలని డిమాండ్ చేశారు.
యూఎల్సీ భూమి రిజిస్ట్రేషన్‌పై అభ్యంతరాలు
పీర్జాదిగూడలోని ఓ అపార్ట్‌మెంట్‌కు సంబంధించిన భూమి రిజిస్ట్రేషన్‌పైనా ప్రవీణ్‌కుమార్ ఆరోపణలు చేశారు. సర్వే నంబర్లు 39, 43, 44కు సంబంధించిన ఓ ప్లాట్ అర్బన్ ల్యాండ్ సీలింగ్ పరిధిలో ఉన్నట్లు చూపుతున్నప్పటికీ రూ.2 లక్షలు తీసుకుని రిజిస్ట్రేషన్ చేశారని ఆరోపించారు. అదే అపార్ట్మెంట్లో మరో ప్లాట్ రిజిస్ట్రేషన్‌కు వెళ్లినప్పుడు గతంలో పొరపాటున రిజిస్ట్రేషన్ జరిగిందని, ప్రస్తుతం రిజిస్ట్రేషన్ చేయడం సాధ్యం కాదని అధికారులు చెప్పినట్లు తెలిపారు. ఈ రెండు వ్యవహారాలపై విచారణ జరిపితే వాస్తవాలు వెలుగులోకి వస్తాయని అన్నారు. కార్యాలయంలో జరుగుతున్న అక్రమ వసూళ్లలో జిల్లా రిజిస్ట్రార్ నుంచి ఉన్నతాధికారుల వరకు నెలనెలా వాటాలు వెళ్తున్నాయంటూ వస్తున్న ఆరోపణలపైనా దర్యాప్తు చేయాలని ప్రవీణ్‌కుమార్ డిమాండ్ చేశారు. ప్రభుత్వ ఉద్యోగులు జీతాలు తీసుకుంటూనే ప్రజల నుంచి అదనపు డబ్బులు వసూలు చేయడం సరికాదన్నారు. ఉప్పల్‌తో పాటు రాష్ట్రవ్యాప్తంగా సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో అవినీతిపై ప్రభుత్వం దృష్టి సారించి కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు. సమస్య పరిష్కారం కాకపోతే సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల ఎదుట తెలంగాణ రియల్టర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ధర్నాలు చేపడతామని హెచ్చరించారు.

