దక్షిణ కొరియా వర్సిటీలో నిషితకు సీటు
ప్రతిష్ఠాత్మక ‘కొయికా’ ఫుల్ స్కాలర్షిప్తో ఎంఎస్సీ అగ్రికల్చర్లో అడ్మిషన్
ఆరు భాషల్లో ప్రావీణ్యం.. రెండుసార్లు పోస్కో స్కాలర్షిప్ విజేత
పేదరికాన్ని అధిగమించి అంతర్జాతీయ స్థాయిలో ప్రతిభ
నిషిత ప్రయాణం నేటి యువతకు స్ఫూర్తిదాయకం
: ఆర్.ఎస్. ప్రవీణ్ కుమార్
కాకతీయ, హైదరాబాద్ : పట్టుదల, ప్రతిభ ఉంటే ఎలాంటి పరిస్థితులనైనా అధిగమించి అంతర్జాతీయ స్థాయిలో రాణించవచ్చని పెద్దపల్లి జిల్లాకు చెందిన వెనగంటి నిషిత నిరూపించారు. దక్షిణ కొరియాలోని ప్రతిష్ఠాత్మక క్యుంగ్బుక్ నేషనల్ యూనివర్సిటీ (కేఎన్యూ)లో ‘కొయికా’ (KOICA) పూర్తి స్కాలర్షిప్తో ఎంఎస్సీ అగ్రికల్చర్ కోర్సులో ఆమె ప్రవేశం పొందారు. ఈ ఘనత సాధించిన నిషితను మాజీ ఐపీఎస్ అధికారి, బీఆర్ఎస్ నేత ఆర్.ఎస్. ప్రవీణ్ కుమార్ అభినందించారు. పెద్దపల్లి జిల్లా ఓదెల మండలం రూప్ నారాయణపేటకు చెందిన నిషిత ఒంటరి తల్లి పెంపకంలో ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కొంటూనే ప్రభుత్వ విద్యాసంస్థల్లో చదువుకున్నారు. 15 ఏళ్లకే ఇంటర్మీడియట్ పూర్తి చేసి బీసీ గురుకులాల్లో రాష్ట్రస్థాయిలో రెండో ర్యాంకు సాధించారు. అనంతరం 19 ఏళ్ల వయసులో ఢిల్లీలోని జవహర్లాల్ నెహ్రూ యూనివర్సిటీ (జేఎన్యూ)లో కొరియన్ లాంగ్వేజ్ విభాగంలో డిగ్రీ పూర్తి చేశారు. చదువులో ప్రతిభ కనబరుస్తూ రెండుసార్లు ప్రతిష్ఠాత్మక పోస్కో (POSCO) స్కాలర్షిప్ను సైతం నిషిత అందుకున్నారు. ఆమెకు ఆరు భాషల్లో ప్రావీణ్యం ఉండటం విశేషం.
రైతులకు అండగా నిలవడమే లక్ష్యం
దక్షిణ కొరియాలో ఎంఎస్సీ అగ్రికల్చర్ పూర్తి చేసి ఆధునిక స్మార్ట్ వ్యవసాయ పద్ధతులను దేశంలో ప్రవేశపెట్టి రైతులకు అండగా నిలవడమే తన లక్ష్యమని నిషిత తెలిపారు. పలు సవాళ్లను అధిగమించి గ్లోబల్ స్థాయిలో రాణిస్తున్న నిషిత పట్టుదల, అంకితభావం నేటి యువతకు స్ఫూర్తిదాయకమని ఆర్.ఎస్. ప్రవీణ్ కుమార్ కొనియాడారు. నిషితతో పాటు ఆమె తల్లి వేముల ప్రవళికను కూడా ఆయన ప్రత్యేకంగా అభినందించారు. నిషితను శాలువాతో సత్కరించి, భవిష్యత్తులో మరిన్ని ఉన్నత శిఖరాలను అధిరోహించాలని ఆకాంక్షించారు.

