తెలంగాణలో దూసుకెళ్తున్న ఈవీలు
రాయితీలతో పెరిగిన కొనుగోళ్లు..
ఏడాదిలో 91,107 వాహనాలు
కొత్త వాహనాల నమోదులో 8.8 శాతం వాటా
కార్లలో ఈవీల వాటా 12.5 శాతం
హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్‌లోనే 68 శాతం నమోదు
కాకతీయ, హైదరాబాద్: తెలంగాణలో ఎలక్ట్రిక్ వాహనాల (ఈవీ) మార్కెట్ వేగంగా విస్తరిస్తోంది. రాష్ట్ర ప్రభుత్వం అందిస్తున్న రాయితీలు, ముఖ్యంగా రోడ్డు పన్ను, రిజిస్ట్రేషన్ ఫీజులపై 100 శాతం మినహాయింపుతో ఈవీల కొనుగోళ్లకు భారీగా ఊతమిస్తోంది. గత ఆర్థిక సంవత్సరంలో రాష్ట్రవ్యాప్తంగా 91,107 ఎలక్ట్రిక్ వాహనాలు రిజిస్టర్ కాగా.. వీటి మొత్తం ఇన్వాయిస్ విలువ రూ.6,283 కోట్లుగా ఉంది. మొత్తం కొత్త వాహనాల నమోదులో ఈవీల వాటా 8.8 శాతానికి చేరింది. కార్ల విభాగంలో ఈ వాటా ఏకంగా 12.5 శాతంగా నమోదవడం ఈవీలకు పెరుగుతున్న ఆదరణకు నిదర్శనంగా మారింది. మరోవైపు 243 ఎలక్ట్రిక్ బస్సులు కూడా రోడ్డెక్కాయి.
జీఓ 41తో భారీ ఊతం
ఎలక్ట్రిక్ వాహనాల కొనుగోళ్లను ప్రోత్సహించేందుకు రాష్ట్ర ప్రభుత్వం 2024 నవంబరు 16న జీఓ 41 జారీ చేసింది. దీని ప్రకారం ఈవీలపై రోడ్డు పన్ను, రిజిస్ట్రేషన్ ఫీజులో 100 శాతం మినహాయింపు కల్పించింది. గతంలో వాహనాల సంఖ్యపై ఉన్న పరిమితులను తొలగించి.. సంఖ్యతో సంబంధం లేకుండా ఈ రాయితీని వర్తింపజేశారు. ట్యాక్సీలు, ప్రైవేటు కార్లు, ద్విచక్ర వాహనాలు, ఆటోలు, టూరిస్టు క్యాబ్‌లు, తేలికపాటి గూడ్స్ వాహనాలు, మూడు సీట్ల ఆటోలు, ఎలక్ట్రిక్ ట్రాక్టర్లకు ఈ మినహాయింపు వర్తిస్తోంది. ప్రభుత్వ సంస్థలు ఉద్యోగుల కోసం నడిపే వాహనాలకు కూడా ఈ ప్రయోజనం అందుతోంది.
గ్రేటర్ పరిధిలోనే 68 శాతం
రాష్ట్రంలో ఎలక్ట్రిక్ వాహనాల కొనుగోళ్లలో హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్–మల్కాజిగిరి జిల్లాలు ముందంజలో ఉన్నాయి. ఈ మూడు జిల్లాల్లోనే మొత్తం ఈవీ నమోదుల్లో సుమారు 68 శాతం నమోదయ్యాయి. ఆయా ప్రాంతాల్లో ఛార్జింగ్ స్టేషన్లు అందుబాటులో ఉండటం, నగర జీవనశైలికి అనుగుణంగా ఈవీల వినియోగం పెరగడం ఇందుకు ప్రధాన కారణాలుగా అధికారులు భావిస్తున్నారు. ఛార్జింగ్ మౌలిక వసతులు మరింత విస్తరితే ఈవీల మార్కెట్ రాష్ట్రంలోని ఇతర ప్రాంతాల్లోనూ వేగంగా పెరిగే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు.
పండుగ ఆఫర్లతో పెరిగిన డిమాండ్
నెలల వారీగా చూస్తే అక్టోబరు, ఫిబ్రవరిలో ఎలక్ట్రిక్ వాహనాల నమోదులు అధికంగా ఉన్నాయి. ఒక్క అక్టోబరులోనే 10,705 ఈవీలు రిజిస్టర్ అయ్యాయి. దసరా, దీపావళి సందర్భంగా వాహన తయారీ సంస్థలు ప్రకటించిన ప్రత్యేక ఆఫర్లు కూడా కొనుగోళ్లను పెంచినట్లు అధికారులు అంచనా వేస్తున్నారు. ఈ ఏడాది ఇప్పటివరకు 18,852 ఎలక్ట్రిక్ కార్లు నమోదయ్యాయి. 2025–26లో కార్ల విభాగంలో ఈవీల వాటా మరింత పెరిగే అవకాశం ఉందని మార్కెట్ వర్గాలు భావిస్తున్నాయి.
ఛార్జింగ్ మౌలిక వసతులపై దృష్టి
ఈవీల వినియోగం వేగంగా పెరుగుతున్నప్పటికీ ఛార్జింగ్ స్టేషన్ల కొరత ప్రధాన సవాలుగా మారుతోంది. ముఖ్యంగా హైదరాబాద్ వెలుపల ఛార్జింగ్ మౌలిక వసతులను విస్తరించాల్సిన అవసరం ఉంది. ఈ నేపథ్యంలో రాష్ట్ర రవాణా శాఖ ప్రత్యేక చర్యలు చేపడుతోంది. ఛార్జింగ్ స్టేషన్ల సంఖ్య పెరిగితే ప్రజల్లో ఉన్న ఆందోళనలు తగ్గి.. ఎలక్ట్రిక్ వాహనాల వినియోగం మరింత విస్తరించే అవకాశం ఉంది. మొత్తంగా పన్ను రాయితీలు, పెరుగుతున్న మోడళ్ల సంఖ్య, పర్యావరణంపై అవగాహన, ఇంధన ఖర్చుల ఆదా వంటి అంశాలు తెలంగాణలో ఈవీ మార్కెట్ వేగంగా ఎదగడానికి దోహదం చేస్తున్నాయి.

