కేటీఆర్ వ్యాఖ్యలపై ఫిర్యాదు
సీపీకి డీసీసీ అధ్యక్షుడు ఇనుగాల ఫిర్యాదు
కాకతీయ, హన్మకొండ : వరంగల్ పోలీస్ కమిషనర్ సన్‌ప్రీత్ సింగ్‌ను వరంగల్ పశ్చిమ నియోజకవర్గ ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి, వర్ధన్నపేట ఎమ్మెల్యే కేఆర్ నాగరాజు, హనుమకొండ, వరంగల్ జిల్లాల డీసీసీ అధ్యక్షులు ఇనగాల వెంకట్రామ్ రెడ్డి, అయూబ్ కలిసి బుధవారం కలిశారు. ఈ సందర్భంగా బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ హంటర్ రోడ్డులో నిర్వహించిన సభలో కాంగ్రెస్ నేతలు రాహుల్ గాంధీ, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పై చేసిన వ్యాఖ్యలను వారు తీవ్రంగా ఖండించారు. ప్రజాప్రతినిధిగా బాధ్యతారాహిత్యంగా, అసభ్యకరంగా మాట్లాడటం ప్రజాస్వామ్య విలువలకు విరుద్ధమని పేర్కొన్నారు. ఈ వ్యాఖ్యలు ప్రజల్లో విద్వేషం రేకెత్తించేలా, వ్యక్తిగత పరువు నష్టం కలిగించేలా ఉన్నాయని ఆరోపించారు. ఈ నేపథ్యంలో సంబంధిత చట్టాల కింద వెంటనే కేసు నమోదు చేసి కఠిన చర్యలు తీసుకోవాలని సీపీకి ఫిర్యాదు చేశారు. భవిష్యత్తులో ఇలాంటి అనుచిత వ్యాఖ్యలు పునరావృతం కాకుండా చట్టపరమైన చర్యలు చేపట్టాలని వారు కోరారు.

