ఆ భూములు అటవీశాఖవే
కాల్వలనాగరం భూవివాదంపై సుప్రీం కోర్టు సంచలన తీర్పు
600 ఎకరాలు అటవీ శాఖకు సంబంధించినవేనని జస్టిస్ ఎస్‌వీఎన్ భట్టి స్పష్టం
ఫసల్ పట్టీల ఆధారంగా యాజమాన్య హక్కులు వర్తింపవు
అవి కేవలం పన్నుల వసూలు కోసమేనని వెల్లడి
రెవెన్యూ రికార్డులపై సుప్రీంకోర్టు సంచలన వ్యాఖ్యలు
నిజాం కాలం నాటి ఫారెస్ట్ గెజిట్ నోటిఫికేషన్‌తో న్యాయస్థానంలో అప్పీలు
ఆధారాలు చూపడంలో విఫలమైన అప్పీలు దారులు
గతంలో తెలంగాణ హైకోర్టు ఇచ్చిన తీర్పును పూర్తిగా సమర్థించిన ధర్మాసనం
కాకతీయ, మణుగూరు : భద్రాద్రి కొత్తగూడెం – పినపాక: భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో దశాబ్దాల కాలంగా నానుతున్న వందల ఎకరాల అటవీ భూముల వివాదానికి దేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు తుది తీర్పుతో తెరదించింది. పినపాక మండలం (ప్రస్తుతం కరకగూడెం మండలం) కాల్వలనాగరం పరిధిలోని సర్వే నంబర్ 81లో గల 600 ఎకరాల వివాదాస్పద భూమి రక్షిత అటవీ ప్రాంతమేనని అత్యున్నత న్యాయస్థానం బుధవారం స్పష్టం చేసింది. ఈ భూమిపై యాజమాన్య హక్కులు కోరుతూ దాఖలైన అప్పీళ్లను విచారించిన జస్టిస్ ఎస్‌వీఎన్ భట్టి నేతృత్వంలోని సుప్రీంకోర్టు ధర్మాసనం అప్పీలుదారుల పిటిషన్లను పూర్తిగా కొట్టివేసింది. గతంలో ఈ వ్యవహారంపై తెలంగాణ హైకోర్టు డివిజన్ బెంచ్ ఇచ్చిన తీర్పును సుప్రీంకోర్టు ధర్మాసనం ఏకీభవిస్తూ పూర్తిగా సమర్థించింది. దీంతో గత కొన్ని ఏళ్లుగా కాల్వలనాగరం భూములపై నెలకొన్న ఉత్కంఠకు ముగింపు పడటమే కాకుండా అటవీ శాఖకు పెద్ద ఊరట లభించింది.
రెవెన్యూ రికార్డులపై కీలక వ్యాఖ్యలు..!
ఈ కేసు విచారణ సందర్భంగా సుప్రీంకోర్టు ధర్మాసనం రెవెన్యూ రికార్డులకు సంబంధించి దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారేలా అత్యంత కీలకమైన వ్యాఖ్యలు చేసింది. “రెవెన్యూ రికార్డులు (ఫైసల్ పట్టీ, వసూల్ బాకీ, పహాణీలు వంటివి) కేవలం ప్రభుత్వానికి పన్నుల వసూలు అవసరాల కోసం మాత్రమే ఉపయోగపడతాయి. అంతేకానీ, అవి సదరు భూములపై శాశ్వత యాజమాన్య హక్కులను కల్పించలేవు” అని కోర్టు స్పష్టం చేసింది. సరైన భూమి పట్టా లేకుండా కేవలం రెవెన్యూ పత్రాల ఆధారంగా భూమిపై హక్కులు క్లెయిమ్ చేయడం చట్టబద్ధం కాదని ధర్మాసనం తేల్చి చెప్పింది. రిట్ పిటిషన్ల ద్వారా భూమిపై హక్కుల డిక్లరేషన్‌ను కోరడం చట్టప్రకారం చెల్లదని కోర్టు అభిప్రాయపడింది.
ఆధారాలు చూపని అప్పీలుదారులు
కాల్వలనాగరం సర్వే నంబర్ 81లోని సుమారు 787 ఎకరాల భూమిని రక్షిత అటవీ ప్రాంతంగా చేర్చుతూ 1950 ఫిబ్రవరి 6న అప్పటి నిజాం ప్రభుత్వం హైదరాబాద్ ఫారెస్ట్ యాక్ట్ కింద గెజిట్ నోటిఫికేషన్ జారీ చేసింది. అయితే, నిజాం రాజులు 1931-33 ఫస్లీ కాలంలోనే ఈ భూములను తమ పూర్వీకులకు పట్టాగా ఇచ్చారని అప్పీలుదారులు వాదించారు. కానీ, తమ క్లెయిమ్‌ను నిరూపించుకోవడానికి అప్పీలుదారులు ఎలాంటి అసలైన ఒరిజినల్ పత్రాలను న్యాయస్థానానికి సమర్పించడంలో పూర్తిగా విఫలమయ్యారని ధర్మాసనం గుర్తించింది. ప్రభుత్వ రికార్డుల ప్రకారం ఆ భూమి గత 75 సంవత్సరాలుగా దట్టమైన అటవీ ప్రాంతంగానే కొనసాగుతోందని పేర్కొంది. అటవీ భూముల పరిరక్షణ విషయంలో ఎట్టి పరిస్థితుల్లోనూ రాజీ పడేది లేదని స్పష్టం చేసిన సుప్రీంకోర్టు, నాటి నిజాం కాలపు ఫారెస్ట్ నోటిఫికేషన్‌ను సవాలు చేస్తూ దాఖలైన పిటిషన్లను కొట్టివేస్తూ తీర్పునిచ్చింది.

