పదోన్నతులతో బాధ్యతను గుర్తించాలి
ప్రజలకు మెరుగైన సేవలు అందించాలి
వరంగల్ పోలీస్ కమిషనర్ సన్ ప్రీత్ సింగ్
పదోన్నతి పొందిన అధికారులకు చిహ్నాల అలంకరణ
కాకతీయ, హనుమకొండ : “పోలీసు శాఖలో పదోన్నతులు కేవలం హోదా పెరగడమే కాకుండా, ప్రజల పట్ల బాధ్యతను కూడా రెట్టింపు చేస్తాయి” అని వరంగల్ పోలీస్ కమిషనర్ (సీపీ) సన్ ప్రీత్ సింగ్ పేర్కొన్నారు. కమిషనరేట్ పరిధిలో ఏఎస్సై స్థాయి నుంచి సబ్ ఇన్‌స్పెక్టర్లుగా (ఎస్‌ఐ) పదోన్నతి పొందిన 25 మంది అధికారులు శుక్రవారం సీపీని మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా ఆయన అధికారుల భుజాలపై ఎస్‌ఐ నక్షత్ర చిహ్నాలను అలంకరించి శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం సీపీ సన్ ప్రీత్ సింగ్ అధికారులతో మాట్లాడుతూ.. ప్రజల సమస్యలను సానుభూతితో ఆలకించి, చట్టపరంగా వేగవంతమైన పరిష్కారం చూపాలని సూచించారు. బాధితులకు తక్షణ సహాయం అందేలా ‘ఫ్రెండ్లీ పోలీసింగ్’ విధానాన్ని అమలు చేయాలన్నారు. కమిషనరేట్ పరిధిలో శాంతిభద్రతల పరిరక్షణలో ప్రతి అధికారి నిజాయితీ, నిబద్ధతతో పనిచేయాలని స్పష్టం చేశారు. ఉద్యోగంలో స్థాయి పెరిగిన కొద్దీ సవాళ్లు కూడా పెరుగుతాయని, వాటిని సమర్థవంతంగా ఎదుర్కొని పోలీసు శాఖకు మంచి పేరు తీసుకురావాలని సీపీ ఆకాంక్షించారు. తనను కలిసిన పదోన్నతి పొందిన అధికారులు సీపీకి పూల మొక్కను అందజేసి కృతజ్ఞతలు తెలిపారు.

