బావిలో పడి తండ్రి–కొడుకు మృతి
మంత్రి సీతక్క దిగ్బ్రాంతి
కాకతీయ, ములుగు ప్రతినిధి : ములుగు జిల్లా గోవిందరావుపేట మండలం కర్లపల్లి గ్రామంలో ప్రమాదవశాత్తు బావిలో పడిన ఘటనలో తండ్రి రస్పూర్ రాజు, కుమారుడు పవన్ బావిలో పడి మృతి చెందడం తీవ్ర విషాదాన్ని కలిగించింది. స్థానికులు వరాల ప్రకారం కర్లపల్లి గ్రామంలోని ఇంటి దగ్గర్లోని సుమారు 35 అడుగుల లోతున్న బావిలో ఆవు లేగా దూడ పడిపోవడంతో, దానిని బయటకు తీసేందుకు ముందుగా కుమారుడు పవన్(23) బావిలోకి దిగాడు.

అనంతరం కొడుకు ప్రమాదంలో ఉండాడని తెలిసి అతడిని కాపాడేందుకు తండ్రి రస్పూర్ రాజు(41) కూడా బావిలోకి దిగినట్లు సమాచారం. ఇద్దరూ ఒకే తాడుతో పైకి రావడానికి ప్రయత్నిస్తున్న సమయంలో తాడు అకస్మాత్తుగా తెగిపోవడంతో ఇద్దరూ బావిలో పడిపోయి పరిస్థితి విషమంగా మారగా ఈ ఘటనలో తండ్రి కొడుకులు ఇద్దరు బావిలో మునిగి ప్రాణాలు కోల్పోయినట్లు సమాచారం. చుట్టుపక్కల ప్రజలు పోలీసులకు సమాచారం అందించడంతో పసరా సీఐ దయాకర్ సంఘటన స్థలానికి చేరుకుని స్థానికుల సహాయంతో మృతదేహాలను వెరికితే పనిలో నిమగ్నమయ్యారు.
ఈ దుర్ఘటనపై మంత్రి సీతక్క దిగ్బ్రాంతి వ్యక్తం చేశారు. ఘటన వివరాలు తెలుసుకునేందుకు సంబంధిత పోలీసు అధికారులతో మాట్లాడి పూర్తి సమాచారం సేకరిస్తున్నట్లు తెలిపారు. అలాగే ఘటనపై సమగ్ర విచారణ జరిపి తగిన చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. బాధిత కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియజేసిన మంత్రి, ఈ కష్ట సమయంలో ప్రభుత్వం అన్ని విధాలుగా అండగా ఉంటుందని హామీ ఇచ్చారు.

