బండి సంజయ్ కుమారుడిపై పోక్సో కేసు
మైనర్ బాలిక ఫిర్యాదుతో పేట్ బషీరాబాద్‌లో కేసు నమోదు
మద్యం తాగించి అత్యాచారానికి పాల్పడ్డాడంటూ ఆరోపణలు
మూడు ప్రాంతాల్లో లైంగిక దాడి జరిగిందని ఫిర్యాదు
కేసు నుంచి తప్పించుకునేందుకే తప్పుడు ఆరోపణలంటున్న బాలిక కుటుంబం
హనీ ట్రాప్ చేసి రూ.5 కోట్లు డిమాండ్ చేశారంటున్న భగీరథ్
పరస్పర ఆరోపణలతో రాజకీయ, సామాజిక వర్గాల్లో సంచలనం
కాకతీయ, హైదరాబాద్/కరీంనగర్ : కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి, బీజేపీ ఎంపీ బండి సంజయ్ కుమారుడు బండి సాయి భగీరథ్ చుట్టూ వివాదం మరింత ముదురుతోంది. ఇప్పటికే బ్లాక్‌మెయిలింగ్, బెదిరింపుల ఆరోపణలతో కరీంనగర్ టూ టౌన్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసిన భగీరథ్‌పై తాజాగా పోక్సో కేసు నమోదవడం సంచలనంగా మారింది. తమ 17 ఏళ్ల మైనర్ కుమార్తెకు మద్యం తాగించి లైంగిక దాడికి పాల్పడ్డాడంటూ బాలిక తల్లిదండ్రులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు పేట్ బషీరాబాద్ పోలీసులు కేసు నమోదు చేసినట్లు సమాచారం. మొయినాబాద్ ప్రాంతంలోని ఓ ఫార్మ్ హౌజ్‌తో పాటు మరో రెండు ప్రాంతాల్లో కూడా అత్యాచారం జరిగినట్లు ఫిర్యాదులో పేర్కొన్నట్లు తెలుస్తోంది. పోలీసులు భారతీయ న్యాయ సంహిత సెక్షన్లు 74, 75తో పాటు పోక్సో చట్టంలోని సెక్షన్ 11 r/w 12 కింద కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. కేసు తీవ్రత దృష్ట్యా పోలీసులు పలు కోణాల్లో ఆధారాలు సేకరిస్తున్నట్లు సమాచారం.
“మా కుమార్తె రెండు సార్లు ఆత్మహత్యాయత్నం చేసింది”
బాలిక తల్లిదండ్రులు చేసిన ఆరోపణలు ఇప్పుడు మరింత కలకలం రేపుతున్నాయి. బండి సాయి భగీరథ్ ప్రవర్తన కారణంగా తమ కుమార్తె రెండు సార్లు ఆత్మహత్యాయత్నానికి పాల్పడిందని వారు ఆరోపిస్తున్నారు. మానసిక ఒత్తిడి, వేధింపుల కారణంగానే తమ కూతురు తీవ్ర ఆవేదనకు గురైందని చెబుతున్నారు. అంతేకాకుండా… ఇప్పుడు కేసు నుంచి బయటపడేందుకే తమ కుమార్తెపైనే తప్పుడు కేసులు మోపే ప్రయత్నం చేస్తున్నారని బాలిక కుటుంబం ఆవేదన వ్యక్తం చేస్తున్నట్లు సమాచారం. “బాధితురాలినే నిందితురాలిగా చూపించే ప్రయత్నం జరుగుతోంది” అన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి.
మరోవైపు ‘హనీ ట్రాప్’ వాదన
ఇక భగీరథ్ వర్గం మాత్రం పూర్తి భిన్నమైన వాదనను ముందుకు తీసుకొస్తోంది. స్నేహం పేరుతో దగ్గరై… తర్వాత పెళ్లి పేరుతో బ్లాక్‌మెయిల్ చేస్తూ రూ.5 కోట్లు డిమాండ్ చేశారని ఆరోపిస్తోంది. డబ్బు ఇవ్వకపోతే తప్పుడు కేసులు పెడతామని బెదిరించారని, ఇప్పటికే ఒత్తిడితో రూ.50 వేల రూపాయలు కూడా ఇచ్చామని చెబుతోంది. అయితే ఈ వాదనలపైనా ఇప్పుడు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. “ఏ తప్పూ చేయనప్పుడు రూ.50 వేలు ఎందుకు ఇచ్చారు..?” అన్న ప్రశ్న సోషల్ మీడియా, రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. భగీరథ్ వర్గం చెబుతున్న ‘హనీ ట్రాప్’ కథనంలో పలు సందేహాలు ఉన్నాయంటూ విమర్శలు వినిపిస్తున్నాయి.
రెండు కేసులు… రెండు వాదనలు
ఒకవైపు భగీరథ్ ఫిర్యాదు ఆధారంగా కరీంనగర్‌లో బ్లాక్‌మెయిలింగ్ కేసు… మరోవైపు హైదరాబాద్ పరిధిలో పోక్సో కేసు నమోదు కావడంతో ఈ వ్యవహారం మరింత క్లిష్టంగా మారింది. రెండు వర్గాలు పరస్పరం తీవ్ర ఆరోపణలు చేసుకుంటుండటంతో అసలు నిజం ఏంటన్న దానిపై ఆసక్తి పెరుగుతోంది. పోలీసులు ఇప్పుడు కాల్ డేటా, చాట్ రికార్డులు, ఆర్థిక లావాదేవీలు, ప్రయాణ వివరాలు, సీసీ ఫుటేజీలు తదితర అంశాలపై ఫోకస్ పెట్టినట్లు తెలుస్తోంది. బాధితురాలి స్టేట్‌మెంట్, వైద్య పరీక్షల నివేదికలు కూడా కేసులో కీలకంగా మారనున్నాయి. కేంద్ర మంత్రికి సంబంధించిన కుటుంబం పేరు ఈ కేసులో రావడంతో రాజకీయంగానూ ఇది సెన్సిటివ్ అంశంగా మారింది. సోషల్ మీడియాలో ఇప్పటికే రెండు వర్గాల మధ్య వాదోపవాదాలు తీవ్రంగా సాగుతున్నాయి. ప్రతిపక్షాలు కూడా ఈ వ్యవహారంపై స్పందించే అవకాశాలు కనిపిస్తున్నాయి. బ్లాక్‌మెయిలింగ్ ఆరోపణలా..? లేక పోక్సో కేసులో ఉన్న ఆరోపణలే నిజమా..? అన్నది ఇప్పుడు పోలీసు దర్యాప్తులో తేలాల్సి ఉంది.

