నర్సంపేట డీఏవో శ్రీనివాస్ మృతి
నర్సంపేట ఆర్డీవో కార్యాలయంలో విషాదం
విధులు నిర్వర్తిస్తుండగా గుండెపోటుతో కన్నుమూత
కాకతీయ, నర్సంపేట : నర్సంపేట రెవెన్యూ డివిజన్ కార్యాలయంలో సోమవారం తీవ్ర విషాదం చోటుచేసుకుంది. ఇక్కడ డివిజనల్ అకౌంట్స్ ఆఫీసర్ (డీఏవో)గా విధులు నిర్వహిస్తున్న శ్రీనివాస్ కార్యాలయంలోనే గుండెపోటుతో మృతి చెందారు. విధి నిర్వహణలో ఉన్న అధికారి ఒక్కసారిగా ప్రాణాలు కోల్పోవడంతో రెవెన్యూ శాఖ సిబ్బంది తీవ్ర దిగ్భ్రాంతికి గురయ్యారు. సహోద్యోగుల కథనం ప్రకారం.. సోమవారం ఉదయం శ్రీనివాస్ యథావిధిగా విధులకు హాజరయ్యారు. పనిలో నిమగ్నమై ఉన్న సమయంలో ఆయనకు ఒక్కసారిగా గుండెపోటు రావడంతో అస్వస్థతకు గురై కుర్చీలోనే కుప్పకూలిపోయారు. గమనించిన తోటి సిబ్బంది వెంటనే స్పందించి ఆయనను హుటాహుటిన ఆసుపత్రికి తరలించారు. అయితే మార్గమధ్యలోనే శ్రీనివాస్ ప్రాణాలు విడిచినట్లు వైద్యులు ధ్రువీకరించారు.
రెవెన్యూ సిబ్బంది సంతాపం
శ్రీనివాస్ ఆకస్మిక మరణ వార్త తెలియడంతో నర్సంపేట ఆర్డీవో కార్యాలయంలో విషాదఛాయలు అలుముకున్నాయి. నర్సంపేట ఆర్డీవో ఉమారాణి, తహసీల్దార్ రవిచంద్రరెడ్డి, సమ్మక్క సహా డివిజన్‌లోని రెవెన్యూ అధికారులు, సిబ్బంది ఆయన మృతికి సంతాపం ప్రకటించారు. మృతుడి కుటుంబ సభ్యులకు తమ ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. నిబద్ధత గల అధికారిని కోల్పోవడం బాధాకరమని సహచర ఉద్యోగులు ఆవేదన వ్యక్తం చేశారు.

