రేకుర్తి, విద్యానగర్‌లో ‘22ఏ’ శాపం
ఏడాదిగా నిలిచిన రిజిస్ట్రేషన్లు.. వేల కుటుంబాలు విలవిల
నిషేధిత జాబితాలో పట్టా భూములు.. అనిశ్చితిలో ‘ఆరు వందల’ ఎకరాలు
బ్యాంకు రుణాలు రాక.. ఆస్తుల బదిలీ కాక ఆర్థిక ఇబ్బందులు
మానవతా దృక్పథంతో స్పందించాలని కలెక్టర్‌కు బాధితుల విన్నపం
కాకతీయ, కరీంనగర్ : కరీంనగర్ నగర పరిధిలోని రేకుర్తి, విద్యానగర్ ప్రాంతాల్లో భూముల రిజిస్ట్రేషన్లపై విధించిన ఆంక్షలు వేలాది కుటుంబాల పాలిట శాపంగా మారాయి. పట్టా భూములను 22/A(1)(d) సీలింగ్ చట్టం కింద నిషేధిత జాబితాలో చేర్చడంతో గత ఏడాది కాలంగా క్రయవిక్రయాలు నిలిచిపోయాయి. దీనిపై సర్వత్రా అనిశ్చితి నెలకొనడంతో బాధితులు సోమవారం జిల్లా కలెక్టరేట్‌ను ఆశ్రయించి తమ గోడు వెళ్లబోసుకున్నారు. రిజిస్ట్రేషన్లు కాక, ఆస్తులు అమ్ముకోలేక, అత్యవసరాలకు బ్యాంకు రుణాలు అందక సుమారు 30 వేల మంది ప్రజలు ఆర్థికంగా కుదేలవుతున్నారు.
రిజిస్ట్రేషన్ల బ్రేక్.. పదివేల ప్లాట్లపై ప్రభావం!
ధరణి పోర్టల్ అమల్లోకి వచ్చిన తర్వాత ఈ ప్రాంతాల్లోని భూములను అకస్మాత్తుగా నిషేధిత జాబితాలో చేర్చడం కలకలం రేపింది.రేకుర్తిలో 125 సర్వే నంబర్లలో దాదాపు 536 ఎకరాల భూమి వివాదంలో చిక్కుకుంది. విద్యానగర్‌లో 16 సర్వే నంబర్లలోని 115 ఎకరాల భూమిపై ఆంక్షలు విధించారు.
మొత్తంగా ఈ 650 ఎకరాల విస్తీర్ణంలో సుమారు 6,000 ఇళ్లు, 10 వేలకు పైగా ప్లాట్లు ఉన్నాయి. రిజిస్ట్రేషన్ కార్యాలయంలో ఈ సర్వే నంబర్ల భూములపై క్రయవిక్రయాలు నిలిపివేయడంతో యజమానులు ఆందోళన చెందుతున్నారు. తమ సొంత ఆస్తుల మీద తమకే హక్కు లేకుండా పోయిందని బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
40 ఏళ్లుగా లేని అభ్యంతరం ఇప్పుడెందుకు?
దశాబ్దాలుగా ఇక్కడ ఇళ్లు నిర్మించుకుని నివసిస్తున్న ప్రజలు అధికారుల తీరుపై మండిపడుతున్నారు. గత 40 ఏళ్లుగా గ్రామ పంచాయతీ, పురపాలక సంఘాల అనుమతులతోనే ఇక్కడ ఇళ్లు నిర్మించుకున్నామని బాధితులు పేర్కొంటున్నారు. ప్రభుత్వం ఇక్కడ సిమెంట్ రోడ్లు, మిషన్ భగీరథ, విద్యుత్ వంటి అన్ని మౌలిక వసతులు కల్పించిందని, పన్నులు కూడా వసూలు చేస్తోందని గుర్తు చేస్తున్నారు. దశాబ్దాలుగా పట్టా భూములుగా ఉన్న వీటిని అకస్మాత్తుగా సీలింగ్ భూములని ప్రకటించడం అన్యాయమని వాపోతున్నారు.
కలెక్టరేట్‌కు క్యూ కట్టిన బాధితులు
రిజిస్ట్రేషన్ల నిలిపివేతతో ఎదురవుతున్న ఇబ్బందులను వివరించేందుకు సోమవారం పెద్ద ఎత్తున ప్రజలు కలెక్టరేట్‌కు తరలివచ్చారు. “పిల్లల చదువులకు, పెళ్లిళ్లకు ప్లాట్లు అమ్ముకుందామంటే కావడం లేదు.. బ్యాంకులో లోన్ తీసుకుందామన్నా అధికారులు కుదరదని చెబుతున్నారు” అని బాధితులు తమ గోడు వెళ్లబోసుకున్నారు. గతంలో ఎలాంటి వివాదాలు లేని ఈ సర్వే నంబర్లను తక్షణమే నిషేధిత జాబితా నుంచి తొలగించాలని డిమాండ్ చేశారు. మానవతా దృక్పథంతో స్పందించి ఆంక్షలను ఎత్తివేసి, తమకు న్యాయం చేయాలని జిల్లా కలెక్టర్‌ను కోరారు. ఈ సమస్యపై ప్రభుత్వం స్పందించకపోతే ఆందోళన ఉధృతం చేస్తామని హెచ్చరించారు.

