బండి కుమారుడిపై కేసు విచారణ స్పీడప్
8న ఫిర్యాదు వస్తే ఇప్పటివరకు చర్యలేవి?
డీజీపీ సీవీ ఆనంద్‌పై సీఎం రేవంత్ సీరియస్
ప్రధాని పర్యటన నేపథ్యంలో అంటూ డీజీపీ వివరణ
నిష్పక్షపాత విచారణ చేపట్టాలని డీజీపీకి సీఎం ఆదేశం
కేసు దర్యాప్తు పర్యవేక్షణకు డీసీపీ రితిరాజ్ నియామకం
బాలల హక్కుల పరిరక్షణ కమిషన్ సీరియస్.. ప్రత్యేక బెంచ్ ఏర్పాటు
కేసుతో పార్టీకి సంబంధం లేదన్న బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచందర్‌రావు
కాకతీయ, తెలంగాణ బ్యూరో: కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమారుడు సాయి భగీరథ్‌పై నమోదైన పోక్సో కేసులో విచారణను వేగవంతం చేయాలని ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి పోలీసు ఉన్నతాధికారులను ఆదేశించారు. ఈ నెల 8వ తేదీనే ఫిర్యాదు అందినప్పటికీ, చర్యలు తీసుకోవడంలో ఎందుకు జాప్యం జరిగిందని డీజీపీ సీవీ ఆనంద్‌ను సీఎం ప్రశ్నించారు. ప్రధాని పర్యటన ఏర్పాట్ల వల్ల జాప్యం జరిగిందని డీజీపీ వివరించగా, తక్షణమే ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి సమగ్ర విచారణ జరపాలని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు. ఈ నేపథ్యంలో సైబరాబాద్ పోలీస్ కమిషనర్ ఈ కేసు పర్యవేక్షణ బాధ్యతలను కూకట్‌పల్లి డీసీపీ రితిరాజ్, ఐపీఎస్ కు అప్పగిస్తూ సోమవారం మెమో జారీ చేశారు.
మహిళా అధికారి పర్యవేక్షణలో దర్యాప్తు
పోక్సో కేసు కావడంతో దర్యాప్తును పర్యవేక్షించే బాధ్యతను ఒక మహిళా ఐపీఎస్ అధికారికి అప్పగించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు దర్యాప్తును వృత్తిపరంగా, ఎటువంటి పక్షపాతం లేకుండా నిర్వహించాలని సీపీ తన ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. డీసీపీ రితిరాజ్ ప్రతిరోజూ విచారణ పురోగతిని సమీక్షించి, రోజువారీ నివేదికను కమిషనర్‌కు సమర్పించాల్సి ఉంటుంది. ఎక్కడా నిర్లక్ష్యానికి తావులేకుండా కేసులోని అన్ని కోణాలను క్షుణ్ణంగా పరిశీలించాలని ఆదేశించారు. తాజా ఉత్తర్వులతో విచారణ ప్రక్రియ వేగవంతం కానుంది. మరోవైపు ఈ కేసుపై రాష్ట్ర బాలల హక్కుల పరిరక్షణ కమిషన్ తీవ్రంగా స్పందించింది. కమిషన్ ఛైర్‌పర్సన్ కొత్తకోట సీతాదయాకర్ రెడ్డి సైబరాబాద్ సీపీ నుంచి కేసు వివరాలను తెప్పించుకున్నారు. బాధితురాలికి న్యాయం జరిగేలా చూసేందుకు విచారణ నిమిత్తం ప్రత్యేక బెంచ్‌ను ఏర్పాటు చేస్తున్నట్లు కమిషన్ ప్రకటించింది. ఘటనపై పూర్తిస్థాయి నివేదికను కమిషన్‌కు అందజేయాలని పోలీసులను కోరింది.
చట్టం తన పని తాను చేస్తుంది : బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచందర్‌రావు
బండి భగీరథ్ కేసుపై బీజేపీ రాష్ట్ర నేత రామచందర్‌రావు స్పందించారు. ఈ కేసుతో పార్టీకి ఎటువంటి సంబంధం లేదని ఆయన స్పష్టం చేశారు. “బండి సంజయ్ మా నాయకుడు, కేంద్ర మంత్రి. కానీ ఈ కేసు ఆయన కుటుంబానికి సంబంధించిన అంశం. చట్టం తన పని తాను చేసుకుపోతుంది. ఒకవేళ విచారణలో బండి సంజయ్ కుటుంబీకుల జోక్యం ఉన్నట్లు తేలితే వారిపైనా చర్యలు తీసుకోవచ్చు” అని వ్యాఖ్యానించారు. ఒకవేళ ఈ ఘటనతో బండి సంజయ్‌కు ఏమైనా సంబంధం ఉంటే చట్టపరమైన చర్యలకు తాము సిద్ధమేనని వెల్లడించారు. ఈ కేసు ఇప్పుడు రాష్ట్ర రాజకీయాల్లో పెను దుమారం రేపుతోంది.

