బండిపై క్రిమినల్ కేసు నమోదు చేయాలి
బాలికకు న్యాయం చేయాల్సింది పోయి..బెదిరింపులా
పోలీసులు సీసీటీవీ ఫుటేజులు స్వాధీనం చేసుకోవాలి
భగీరథ సాయి, బండి సంజయ్ ఫోన్ కాల్ డేటాను పరిశీలించాలి
బాధితురాలికి న్యాయం జరిగేంత వరకు కాంగ్రెస్ పోరాటం
కేంద్రం ప్రభుత్వం బేటీ బచావో నినాదాలకే పరిమితమా?
కుడా చైర్మన్, హన్మకొండ డీసీసీ అధ్యక్షుడు ఇనుగాల వెంకట్రామ్ రెడ్డి ధ్వజం
కాకతీయ, వరంగల్ బ్యూరో : కొడుకు చేతిలో మోసపోయిన బాలికకు న్యాయం చేయాల్సింది పోయి..బాధితురాలిని కేంద్ర మంత్రి బండి సంజయ్ బెదిరింపులకు పాల్పడటం దారుణమని కుడా చైర్మన్, హన్మకొండ డీసీసీ అధ్యక్షుడు ఇనుగాల వెంకట్రామ్ రెడ్డి అన్నారు. బాలికను, బాలిక కుటుంబ సభ్యులు బెదిరింపులకు పాల్పడిన బండి సంజయ్‌పై క్రిమినల్ కేసులు నమోదు చేయాలని ఇనుగాల డిమాండ్ చేశారు. పోక్సో కేసు బాధితురాలిని బెదిరిస్తూ, అవమానకర వ్యాఖ్యలు చేశారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. సోమవారం హన్మకొండలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ బాలికపై బాధ్యతాయుతమైన పదవిలో ఉన్న ప్రజాప్రతినిధి వ్యవహరించిన తీరు అత్యంత అమానవీయమని మండిపడ్డారు. న్యాయం కోసం తనను ఆశ్రయించిన 17 ఏళ్ల బాలికను ఓదార్చాల్సింది పోయి, ఆమె వ్యక్తిత్వాన్ని కించపరిచేలా వ్యాఖ్యలు చేయడం దారుణమని విమర్శించారు. నీ బిడ్డ ఎంతమందితో తిరిగిందో నాకు తెలియదు అనే తరహాలో బండి సంజయ్ మాట్లాడటం ఆయన వికృత మనస్తత్వానికి నిదర్శనమని అన్నారు. నాతో పెట్టుకుంటే మీకు ఏం జరిగినా నా బాధ్యత కాదు అంటూ బాధిత కుటుంబాన్ని బండి సంజయ్ బెదిరించారని వెంకట్రామ్ రెడ్డి ఆరోపించారు. బాధితులకు అండగా నిలవాల్సిన ప్రజాప్రతినిధులు, నిందితులకు కొమ్ముకాస్తూ బాధితులను మానసికంగా వేధించడం దురదృష్టకరమన్నారు. ఈ ఘటనపై పోలీసులు సుమోటోగా కేసు నమోదు చేయాలని డిమాండ్ చేశారు.
సంగప్ప పాత్రపై అనుమానాలు
ఈ వ్యవహారంలో మాజీ జర్నలిస్ట్, బీజేపీ అధికార ప్రతినిధిగా పనిచేసిన సంగప్ప పాత్రపై కూడా అనుమానాలు వ్యక్తం చేశారు. మూడు సంవత్సరాలుగా బీజేపీతో అనుబంధంగా ఉన్న సంగప్ప, ఈ కేసులో మధ్యవర్తిలా వ్యవహరించారని ఆరోపించారు. ఏప్రిల్ 22 నుంచి 26 వరకు బాధిత కుటుంబాన్ని బండి సంజయ్ నివాసానికి తీసుకెళ్లిన నేపథ్యంలో, ఈ వ్యవహారం వెనుక ఉన్న అసలు ఉద్దేశాలను బయటపెట్టాలని డిమాండ్ చేశారు. బాధితురాలి కుటుంబం తమ వద్ద ఉన్న వీడియోలు, చాటింగ్ ఆధారాలను చూపించినప్పటికీ, వాటిని పరిశీలించకుండా బాధితులపైనే అనుమానాలు వ్యక్తం చేయడం వెనుక ఆంతర్యం ఏమిటని వెంకట్రామ్ రెడ్డి ప్రశ్నించారు. ఆధారాలను నిర్లక్ష్యం చేసి బాధితులనే నిందితులుగా చూపించే ప్రయత్నం జరుగుతోందని ఆరోపించారు. ఈ వ్యవహారంపై వెంటనే సమగ్ర దర్యాప్తు చేపట్టాలని కాంగ్రెస్ పార్టీ తరుపున డిమాండ్ చేస్తున్నట్లు ఇనుగాల తెలిపారు. ముఖ్యంగా జూబ్లీహిల్స్‌లోని బండి సంజయ్ నివాసం పరిసరాల్లో ఏప్రిల్ 26 ప్రాంతానికి సంబంధించిన సీసీటీవీ ఫుటేజ్‌ను స్వాధీనం చేసుకోవాలని అన్నారు. బండి సంజయ్, సంగప్ప, బాధిత కుటుంబ సభ్యుల ఫోన్ కాల్ డేటాను విశ్లేషించి వాస్తవాలను వెలికితీయాలన్నారు. బేటీ బచావో అంటూ ప్రచారం చేసే బీజేపీ నాయకులు, తమ సొంత వ్యవహారాల్లో మాత్రం ఆడపిల్లలను అవమానిస్తున్నారని వెంకట్రామ్ రెడ్డి విమర్శించారు. మహిళల భద్రతపై బీజేపీ ద్వంద్వ వైఖరిని ప్రజలు గమనిస్తున్నారని, ఈ ఘటనలో నిజాలు బయటకు వచ్చే వరకు కాంగ్రెస్ పార్టీ వెనక్కి తగ్గదని హెచ్చరించారు.

