రుద్రంగిలో బీఆర్ఎస్‌కు షాక్.. కాంగ్రెస్ గూటికి మాజీ సర్పంచులు
ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ సమక్షంలో చేరికలు
కాకతీయ, వేములవాడ : రాజన్న సిరిసిల్ల జిల్లా రుద్రంగి మండల రాజకీయాల్లో కీలక పరిణామం చోటుచేసుకుంది. బీఆర్ఎస్ పార్టీకి చెందిన పలువురు కీలక నాయకులు, మాజీ సర్పంచులు ఆ పార్టీని వీడి కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్నారు. సోమవారం రాష్ట్ర ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్, రాష్ట్ర కోపరేటివ్ యూనియన్ చైర్మన్ మానాల మోహన్ రెడ్డి సమక్షంలో వీరంతా కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఉమ్మడి మానాల గ్రామానికి చెందిన బీఆర్ఎస్ మాజీ సర్పంచ్ మాలవత్ రమణయ్య, రూప్ల తండా జగదంబ సేవాలాల్ గుడి చైర్మన్ భూక్యా నారాయణ నాయక్, సీనియర్ నాయకులు అజ్మీరా విఠల్, లక్పతి, లకవత్ విష్ణు, భూక్యా శర్మన్ నాయక్ తదితరులు కాంగ్రెస్ గూటికి చేరారు. వీరికి ఆది శ్రీనివాస్ పార్టీ కండువాలు కప్పి ఘనంగా ఆహ్వానించారు. ఈ సందర్భంగా ఆది శ్రీనివాస్ మాట్లాడుతూ.. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఆరు గ్యారెంటీలు, అమలు చేస్తున్న సంక్షేమ పథకాలకు ఆకర్షితులై వివిధ పార్టీల నుంచి నాయకులు స్వచ్ఛందంగా తరలివస్తున్నారని తెలిపారు. గ్రామాల అభివృద్ధి, సామాన్యుల సంక్షేమం కేవలం కాంగ్రెస్ ప్రభుత్వంతోనే సాధ్యమని ఆయన ధీమా వ్యక్తం చేశారు. రుద్రంగి మండలంలో కాంగ్రెస్ పార్టీ రోజురోజుకూ బలపడుతోందని, రానున్న రోజుల్లో మరిన్ని చేరికలు ఉంటాయని ఈ సందర్భంగా స్థానిక నాయకులు పేర్కొన్నారు. కార్యక్రమంలో కాంగ్రెస్ మండల అధ్యక్షుడు తుమ్ జలపతి, మార్కెట్ కమిటీ డైరెక్టర్ కొమ్ముల రవీందర్ రెడ్డి, మానాల ఉప సర్పంచ్ దాసరి అశోక్, రూప్ల తండా సర్పంచ్ జవహర్ లాల్ నాయక్ తదితరులు పాల్గొన్నారు.

