బండి సంజయ్‌ని బర్తరఫ్ చేయాలి
భగీరథ సాయిపై నమోదైన పోక్సో కేసును సమగ్రంగా విచారించాలి
నిందితుడిని అరెస్ట్ చేయకపోతే రాష్ట్రవ్యాప్తంగా ఆందోళనలు
బాలిక కేసును పక్కదారి పట్టించే కుట్ర జరుగుతోంది
జీవో నెంబర్ 17 వెంటనే రద్దు చేయాలని డిమాండ్
ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ కాంట్రాక్టర్లకు అన్యాయం
మాజీ ఎమ్మెల్యే, బీఆర్ఎస్ హనుమకొండ జిల్లా అధ్యక్షుడు దాస్యం వినయ్ భాస్కర్
వరంగల్ కమిషనరేట్‌ను ముట్టడించిన బీఆర్ఎస్వీ నాయకులు
కాకతీయ, వరంగల్ బ్యూరో : కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమారుడు భగీరథ సాయిపై నమోదైన పోక్సో కేసును సమగ్రంగా విచారించాలని, బండి సంజయ్‌ను తక్షణమే పదవి నుంచి బర్తరఫ్ చేయాలని మాజీ ప్రభుత్వ చీఫ్ విప్, బీఆర్ఎస్ హనుమకొండ జిల్లా అధ్యక్షుడు దాస్యం వినయ్ భాస్కర్ డిమాండ్ చేశారు. మైనర్ బాలికపై జరిగిన లైంగిక దాడి కేసులో నిందితులను కాపాడేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రయత్నిస్తోందని వినయ్ భాస్కర్ ఆరోపించారు. సోమవారం హనుమకొండ బాలసముద్రంలోని పార్టీ కార్యాలయంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ పోలీసులు మొదట పోక్సో చట్టం కింద కేసు నమోదు చేసినా, ప్రస్తుతం రాజకీయ ఒత్తిళ్లతో సెక్షన్లు మార్చి నిందితుడిని తప్పించేందుకు ప్రయత్నిస్తున్నారని వినయ్ భాస్కర్ విమర్శించారు. నిందితులను అరెస్ట్ చేయకుండా కాలయాపన చేస్తున్న తీరు అమానవీయమన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఒకవైపు జాతీయ స్థాయిలో ఇలాంటి ఘటనలపై గళమెత్తుతూ, రాష్ట్రంలో మాత్రం బీజేపీ నాయకులను కాపాడటం ఏంటని ప్రశ్నించారు. బాధితులకు న్యాయం చేయాల్సింది పోయి, వారిని వేధించిన పోలీసులపై కూడా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.

వరంగల్ కమిషనరేట్ ముట్టడి
మైనర్ బాలికకు న్యాయం చేయాలని డిమాండ్ చేస్తూ బీఆర్ఎస్వీ కాకతీయ యూనివర్సిటీ అధ్యక్షుడు బైరపాక ప్రశాంత్ ఆధ్వర్యంలో విద్యార్థి నాయకులు వరంగల్ కమిషనరేట్‌ను ముట్టడించారు. ఈ నిరసనకు బీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు దాస్యం విజయ్ భాస్కర్ మద్దతు తెలిపారు. వెంటనే నిందితుడిని అరెస్ట్ చేయకపోతే రాష్ట్రవ్యాప్తంగా ఉద్యమాలు చేపడతామని వారు హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో కంజర్ల మనోజ్ కుమార్, జెట్టి రాజేందర్ తదితరులు పాల్గొన్నారు. ఇదిలా ఉండగా కాంట్రాక్టు పనుల్లో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీలకు అన్యాయం చేస్తూ కాంగ్రెస్ ప్రభుత్వం తెచ్చిన జీవో నెంబర్ 17ను వెంటనే రద్దు చేయాలని వినయ్ భాస్కర్ డిమాండ్ చేశారు. హనుమకొండ కలెక్టరేట్ ఎదుట కాంట్రాక్టర్లు చేపట్టిన ధర్నాకు ఆయన మద్దతు పలికారు.కేసీఆర్ ప్రభుత్వంలో అట్టడుగు వర్గాల కాంట్రాక్టర్లకు దక్కిన అవకాశాలను నేడు పెద్ద కాంట్రాక్టర్లకు కట్టబెడుతూ, చిన్న కాంట్రాక్టర్లను ప్రభుత్వం రోడ్డున పడేస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు. ఆ వర్గాలకు న్యాయం జరిగే వరకు తమ పోరాటం ఆగదని స్పష్టం చేశారు.

