హుజూరాబాద్‌కు ట్రామా కేర్ సెంటర్
ప్రమాద బాధితులకు త్వరలో మెరుగైన వైద్యం
కాంగ్రెస్ హుజురాబాద్ నియోజకవర్గ ఇంచార్జి వొడితల ప్రణవ్
కాకతీయ, హుజూరాబాద్ : హుజూరాబాద్ ప్రభుత్వ ఆసుపత్రిలో త్వరలోనే ప్రత్యేక ట్రామా కేర్ సెంటర్ ఏర్పాటు కానుందని కాంగ్రెస్ నియోజకవర్గ ఇంచార్జి వొడితల ప్రణవ్ వెల్లడించారు. సోమవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ.. రహదారి ప్రమాదాలకు గురైన బాధితులకు ప్రాణాపాయం నుంచి రక్షించేందుకు, తక్షణ వైద్య సేవలు అందించేందుకు ఈ కేంద్రం ఎంతో దోహదపడుతుందని పేర్కొన్నారు. వరంగల్-కరీంనగర్ ప్రధాన రహదారిపై హుజూరాబాద్ కీలకమైన ప్రాంతంలో ఉందని, ఇక్కడ తరచూ జరుగుతున్న ప్రమాదాల దృష్ట్యా ట్రామా సెంటర్ అవశ్యకతను రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ మంత్రి దామోదర రాజనర్సింహ దృష్టికి తీసుకెళ్లినట్లు ప్రణవ్ తెలిపారు. ఈ అంశంపై పలుమార్లు మంత్రిని కలిసి చర్చించగా, ఆయన సానుకూలంగా స్పందించి తగిన చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించినట్లు వివరించారు.
పేదలకు చేరువగా వైద్య సేవలు
కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత హుజూరాబాద్ నియోజకవర్గంలో వైద్య రంగంపై ప్రత్యేక దృష్టి సారించామని ప్రణవ్ పేర్కొన్నారు. ప్రభుత్వ ఆసుపత్రిలో సౌకర్యాల మెరుగుదలతో పాటు, పేద ప్రజలకు కార్పొరేట్ స్థాయి వైద్యం అందించేలా మార్పులు తీసుకువస్తున్నామని తెలిపారు. ట్రామా కేర్ సెంటర్ ఏర్పాటుతో ఈ ప్రాంత ప్రజలకు మెరుగైన అత్యవసర వైద్యం అందుబాటులోకి వస్తుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు.

