తాళం వేసిన ఇంట్లో భారీ చోరీ
బంగారం, నగదు అపహరణ
మంగపేట మండలం కమలాపురంలో ఘటన
కాకతీయ, ఏటూరునాగారం : శుభకార్యానికి వెళ్లిన ఓ కుటుంబాన్ని లక్ష్యంగా చేసుకున్న దుండగులు.. తాళం వేసిన ఇంట్లోకి చొరబడి భారీ చోరీకి పాల్పడ్డారు. మంగపేట మండలం కమలాపురం సీపీ నగర్లో వెలుగుచూసిన ఈ ఘటన స్థానికంగా కలకలం రేపింది. బాధితులు తెలిపిన వివరాల ప్రకారం.. సుమారు 3 తులాల బంగారం, 15 తులాల వెండి ఆభరణాలతో పాటు లక్ష రూపాయలకు పైగా నగదును దొంగలు ఎత్తుకెళ్లారు. సీపీ నగర్‌కు చెందిన మేడిద రఘుపతి కుటుంబ సభ్యులు శనివారం హన్మకొండలోని బంధువుల ఇంటికి శుభకార్యానికి వెళ్లారు. ఇంటికి తాళం వేసి ఉండటాన్ని గమనించిన దొంగలు, అర్ధరాత్రి సమయంలో తలుపుల తాళాలు కోసి లోపలికి ప్రవేశించారు. బీరువాలో భద్రపరిచిన నగదు, నగలను దోచుకున్నారు. దొంగలు వెళ్లేటప్పుడు తలుపులు తీసి ఉంచడంతో రెండు రోజులుగా కోతులు ఇంట్లోకి ప్రవేశించి సామాన్లను చిందరవందర చేశాయి. గమనించిన స్థానికులు యజమాని రఘుపతికి సమాచారం అందించగా, ఇంటికి చేరుకున్న ఆయన చోరీ జరిగినట్లు గుర్తించి పోలీసులకు ఫిర్యాదు చేశారు.
వరుస ఘటనలతో ప్రజల భయం
నెల రోజుల క్రితం ఇదే గ్రామంలో ఒక మహిళ మెడలోని గొలుసు లాక్కెళ్లేందుకు ఇద్దరు మహిళా దొంగలు ప్రయత్నించడం గమనార్హం. వరుసగా చోటుచేసుకుంటున్న దొంగతనాలతో కమలాపురం వాసులు భయాందోళనకు గురవుతున్నారు. పోలీసులు గ్రామంలో గస్తీ పెంచి, దొంగలను త్వరగా పట్టుకోవాలని గ్రామస్థులు డిమాండ్ చేస్తున్నారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తును ముమ్మరం చేశారు.

