ప్రొసీడింగులు ఏ లెక్కన ఇస్తున్నరు..?!
ఏం అధికారముందని జారీ చేస్తరు
మునిసిపల్ అధికారుల నిబంధనలు ఉల్లంఘన
ఎమ్మెల్యే సత్యనారాయణ రావుకు ప్రొటోకాల్ ఇవ్వకుంటే ఊరుకుంటారా..?
అధికారులపై క్రిమినల్ కేసులు పెట్టాలి
భూపాలపల్లి మున్సిపల్ ఫ్లోర్ లీడర్ గండ్ర హరీష్ రెడ్డి ధ్వజం
కమిషనర్, హౌసింగ్ డీఈకి బీఆర్ఎస్ కౌన్సిలర్ల వినతిపత్రం
కాకతీయ, భూపాలపల్లి : భూపాలపల్లి మున్సిపాలిటీ పరిధిలోని ఆయా వార్డుల్లో ఓడిపోయిన కాంగ్రెస్ పార్టీ నాయకులు రాజ్యాంగబద్ధమైన ప్రోటోకాల్ ను పక్కన పెట్టి అర్హులకు ఇందిరమ్మ ఇండ్ల ప్రొసీడింగ్‌లు ఇవ్వడంపై బీఆర్ఎస్ మున్సిపల్ ఫ్లోర్ లీడర్ గండ్ర హరీష్ రెడ్డి తీవ్రంగా మండిపడ్డారు. ప్రజల చేత ఎన్నికైన కౌన్సిలర్లు తాముండగా, తిరస్కరించబడిన కాంగ్రెస్ నాయకులు ఏ అధికారంతో ఇందిరమ్మ ఇండ్ల ప్రొసీడింగ్‌లు ఇచ్చి శంకుస్థాపనలు చేస్తున్నారని ప్రశ్నించారు. ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు ప్రోటోకాల్‌ను ఇలాగే ఉల్లంఘిస్తే ఊరుకుంటారా అని నిలదీశారు. వార్డుల్లో కాంగ్రెస్ నాయకులు తమ అనుచరులకు ఇండ్లు ఇచ్చుకుంటూ, అర్హులు ప్రశ్నించే సరికి బీఆర్ఎస్ కౌన్సిలర్లే ఇండ్లను ఆపుతున్నారని దొంగ మాటలు చెప్పడం సిగ్గుచేటన్నారు. మున్సిపాలిటీ పరిధిలో అర్హులైన నిరుపేదలకు ఇందిరమ్మ ఇండ్లు ఇవ్వాలని, ఎస్సీ కార్పొరేషన్ ఎంపికల్లో జరిగిన అవకతవకలను నిరసిస్తూ సోమవారం మున్సిపల్ కమిషనర్ ఉదయ్ కుమార్, హౌసింగ్ డీఈ అజ్మీర శ్రీకాంత్‌కు బీఆర్ఎస్ కౌన్సిలర్లు వినతి పత్రాలు అందజేశారు. అనంతరం మున్సిపల్ కార్యాలయం వద్ద నిర్వహించిన మీడియా సమావేశంలో హరీష్ రెడ్డి మాట్లాడారు.
ఎన్నికల కోడ్ ఉల్లంఘనపై విచారణ చేపట్టాలి
ఫిబ్రవరిలో ఎన్నికల ప్రవర్తన నియమావళి (ఎలక్షన్ కోడ్) అమల్లో ఉన్నప్పటికీ కాంగ్రెస్ అభ్యర్థులు ఇందిరమ్మ ఇండ్ల కమిటీల ఆర్డర్లు, ప్రొసీడింగ్ కాపీలను ప్రజలకు అందజేశారని హరీష్ రెడ్డి ఆరోపించారు. ఈ చర్య ఎన్నికల ఫలితాలపై ప్రభావం చూపిందని, దీనిపై మున్సిపల్ కమిషనర్, హౌసింగ్ అధికారులు సమాధానం చెప్పాలన్నారు. ఎన్నికల నియమావళిని ఉల్లంఘించిన అధికారులపై క్రిమినల్ కేసులు నమోదు చేయాలని డిమాండ్ చేశారు. ప్రతి వార్డులో ప్రజల చేత ఎన్నుకోబడిన కౌన్సిలర్లను ఇందిరమ్మ ఇండ్ల కమిటీకి చైర్మన్‌గా ఉంచాలన్నారు. కాంగ్రెస్ నాయకుల అరాచకాలపై సమగ్ర విచారణ జరిపించాలని, లేనిపక్షంలో హౌసింగ్, మున్సిపల్ కార్యాలయాలను ముట్టడిస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో కౌన్సిలర్లు కట్ల పూర్ణచందర్, మోతే రాజు, భోగం నరేందర్, బీఆర్ఎస్ నాయకులు బుర్ర సదానందం, వంశీ, జ్యోతుల వెంకటేశ్వర్లు పాల్గొన్నారు.

