త్రివేణి సంగమానికి పుష్కర శోభ
21 నుంచి సరస్వతి అంత్య పుష్కరాలు
కాళేశ్వరంలో ముమ్మరంగా సాగుతున్న ఏర్పాట్లు
12 రోజుల పాటు మూడు నదుల సంగమంలో ఆధ్యాత్మిక సందడి
గోదావరి తీరంలో బారిరికేడ్లు.. ఘాట్ల వద్ద వసతుల కల్పన
ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్న కలెక్టర్ రాహుల్ శర్మ, ఎస్పీ సంక్తీర్త్
కాకతీయ, భూపాలపల్లి : దక్షిణ కాశీగా ప్రసిద్ధి చెందిన జయశంకర్ భూపాలపల్లి జిల్లాలోని కాళేశ్వర త్రివేణి సంగమ తీరం సరస్వతి అంత్య పుష్కరాలకు సిద్ధమవుతోంది. మే 21వ తేదీ (గురువారం) నుంచి జూన్ 1వ తేదీ వరకు 12 రోజుల పాటు అత్యంత వైభవంగా జరగనున్న ఈ అంత్య పుష్కరాల కోసం జిల్లా యంత్రాంగం అన్ని రకాల ఏర్పాట్లను ముమ్మరం చేసింది. గోదావరి, ప్రాణహిత, అంతర్వాహినిగా ప్రవహించే సరస్వతి నదుల కలయిక అయిన ఈ పవిత్ర తీరంలో పుష్కర స్నానాలు ఆచరించేందుకు ఉమ్మడి వరంగల్ జిల్లాతో పాటు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్ర, ఛత్తీస్‌గఢ్ రాష్ట్రాల నుండి లక్షలాదిగా భక్తులు తరలివచ్చే అవకాశం ఉంది. పుష్కరాలకు సమయం తక్కువగా ఉండటంతో జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ, జిల్లా ఎస్పీ సిరిశెట్టి సంకీర్త్ స్వయంగా రంగంలోకి దిగి పనులను పర్యవేక్షిస్తున్నారు. భక్తుల రద్దీని తట్టుకునేలా ప్రధాన ఘాట్‌తో పాటు సరస్వతి ఘాట్ వద్ద ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నారు. నదిలో నీటి మట్టాన్ని నిరంతరం పర్యవేక్షిస్తూ, భక్తులు లోతైన ప్రాంతాలకు వెళ్లకుండా ఉండేందుకు ప్రతి 50 మీటర్లకు రక్షణ బారికేడ్లను ఏర్పాటు చేస్తున్నారు. ఎలాంటి ప్రమాదాలు జరగకుండా ముందస్తు చర్యగా అనుభవజ్ఞులైన గజఈతగాళ్లను ఘాట్ల వద్ద అందుబాటులో ఉంచుతున్నారు. నదిలోకి దిగే భక్తులు జారిపడకుండా ఉండేందుకు క్వయర్ మ్యాట్లను పరుస్తున్నారు.

ఎలాంటి ఇబ్బందులు లేకుండా వసతుల కల్పన
పుష్కరాలకు వచ్చే మహిళా భక్తుల సౌకర్యార్థం ఘాట్ల వద్ద తగినన్ని బట్టలు మార్చుకునే గదులను, తాత్కాలిక షవర్ ట్యాప్స్‌ను నిర్మిస్తున్నారు. ఎండ తీవ్రత దృష్ట్యా ప్రధాన ఘాట్ నుంచి సరస్వతీ ఘాట్ వరకు నిర్మించిన తాత్కాలిక రహదారులపై దుమ్ము లేవకుండా నిరంతరం నీటిని చల్లేందుకు ఏర్పాట్లు చేశారు. దూరప్రాంతాల నుంచి వచ్చే భక్తుల వసతికి టెంట్ సిటీ, వివిధ ప్రభుత్వ శాఖల ఆధ్వర్యంలో ప్రత్యేక అవగాహన స్టాల్స్ ఏర్పాటు చేస్తున్నారు. ప్రముఖులు, వివిఐపిల రాక కోసం హెలిప్యాడ్‌ను సిద్ధం చేసి, దాని చుట్టూ రక్షణ బ్యారికేడ్లను నిర్మిస్తున్నారు. కాళేశ్వరం వచ్చే భక్తులు ఇబ్బంది పడకుండా ఉండేందుకు ప్రధాన కూడళ్లలో సైన్ బోర్డులు, రంగురంగుల లైటింగ్ ఏర్పాటు చేస్తున్నారు. స్థానిక మ్యూజియంలోని ప్రతి విగ్రహం వద్ద భక్తులకు అర్థమయ్యేలా పూర్తి సమాచార బోర్డులను ఉంచుతున్నారు. ఇరిగేషన్, ఆర్ అండ్ బీ, పంచాయతీ రాజ్, విద్యుత్, వైద్య ఆరోగ్య శాఖల అధికారులు క్షేత్రస్థాయిలోనే ఉండి పనులను బుధవారం సాయంత్రానికి పూర్తి చేసేలా రాత్రింబవళ్లు శ్రమిస్తున్నారు.


