రోడ్డు ప్రమాదంలో ఒకరు మృతి
ఆగి ఉన్న ట్రాక్టర్‌ను ఢీకొట్టిన ద్విచక్ర వాహనం
కాకతీయ,రాయపర్తి : వరంగల్ జిల్లా రాయపర్తి మండలంలోని మురిపిరాల గ్రామ శివారులో ఆదివారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ యువకుడు అక్కడికక్కడే మృతి చెందాడు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. వర్ధన్నపేట మండలం దమ్మన్నపేట గ్రామానికి చెందిన బక్కతట్ల కుమారస్వామి (22) ఆదివారం ఉదయం పని నిమిత్తం తొర్రూర్ మండలంలోని వెంకటాపురం గ్రామానికి వెళ్లాడు. పని ముగిసిన అనంతరం రాత్రి పల్సర్ ద్విచక్ర వాహనంపై దమ్మన్నపేటకు తిరుగుప్రయాణమయ్యాడు. రాత్రి 9 గంటల సమయంలో వరంగల్-ఖమ్మం జాతీయ రహదారిపై మురిపిరాల శివారులోని హరిచందన కాటన్ మిల్లు వద్దకు రాగానే, రోడ్డు పక్కన ఆగి ఉన్న ట్రాక్టర్‌ను అతడి బైక్ బలంగా ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఛాతి భాగంలో తీవ్ర గాయాలవ్వడంతో కుమారస్వామి అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం వర్ధన్నపేట మార్చురీకి తరలించారు. మృతుడి తండ్రి రాములు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై ముత్యం రాజేందర్ తెలిపారు.

