చివరి గింజ వరకు కొనుగోలు చేస్తాం
ధాన్యం రైతులెవరూ అధైర్యపడొద్దు
సిద్ధిపేట జిల్లా కలెక్టర్ కె. హైమావతి
చేర్యాల మార్కెట్లో కొనుగోళ్లను పరిశీలించిన కలెక్టర్
మక్కలు, వరి ధాన్యం దిగుమతిని వేగవంతం చేయాలని ఆదేశం
కాకతీయ, చేర్యాల : ప్రభుత్వం రైతులు పండించిన ధాన్యంలో చివరి గింజ వరకు కొనుగోలు చేస్తుందని, అన్నదాతలు ఎవరూ కూడా అధైర్యపడవద్దని జిల్లా కలెక్టర్ కె. హైమావతి భరోసా ఇచ్చారు. మంగళవారం చేర్యాల పట్టణంలోని వ్యవసాయ మార్కెట్ కమిటీ ఆవరణలో సాగుతున్న ధాన్యం, మొక్కజొన్న (మక్కలు) కొనుగోలు ప్రక్రియను కలెక్టర్ క్షేత్రస్థాయిలో పరిశీలించారు. ఈ సందర్భంగా కొనుగోలు కేంద్రాల వద్ద రైతులతో మాట్లాడి వారి ఇబ్బందులను అడిగి తెలుసుకున్నారు. మార్కెట్ యార్డులో వరి ధాన్యం, మక్కల లిఫ్టింగ్ (తరలింపు) ప్రక్రియలో జాప్యం జరుగుతున్నట్లు కలెక్టర్ కె. హైమావతి గమనించారు. దీనిపై ఆమె స్పందిస్తూ.. మార్కెట్ కమిటీలోని షెడ్ ఉన్న ప్రాంతంలో కొనుగోలు చేసిన ధాన్యాన్ని తక్షణమే దిగుమతి చేసుకోవాలని ఏఎంసి సిబ్బందిని ఆదేశించారు. షెడ్ లోపల ఉన్న వరి, మక్కలను వెంటనే కాంటా వేసి, కొనుగోలు పూర్తి చేసి శుభ్రం చేయాలన్నారు. ఏఎంసి పరిసర ప్రాంతాల నుండి లారీలు, ట్రాక్టర్లలో తరలించిన ధాన్యపు బస్తాలను ఇక్కడే దిగుమతి చేసుకుని, సివిల్ సప్లై అధికారుల సమక్షంలో సురక్షితంగా భద్రపరచాలని సూచించారు.
సన్న వడ్లు పండిస్తే నిల్వ సమస్య ఉండదు
రాబోయే ఖరీఫ్ సీజన్ నుండి రైతులంతా సన్న వరి ధాన్యం పండించేందుకు ముందుకు రావాలని కలెక్టర్ పిలుపునిచ్చారు. “గత మూడు సీజన్లుగా మన ప్రాంతంలో దొడ్డు రకం వడ్లు ఎక్కువగా పండించడం వల్ల గోదాములు, రైస్ మిల్లులలో నిల్వ చేయడానికి (స్టోరేజ్) స్థలం లేక తీవ్ర ఇబ్బందిగా మారింది. అందుకే వచ్చే ఖరీఫ్‌లో రైతులు సన్న వడ్లు పండించాలి. దీనివల్ల నిల్వ సమస్య తీరడమే కాకుండా, మన రైతులు పండించిన సన్న బియ్యాన్నే నేరుగా రేషన్ దుకాణాల ద్వారా ప్రజలకు పంపిణీ చేయడానికి వీలవుతుంది” అని కలెక్టర్ వివరించారు. ఈ కార్యక్రమంలో మార్కెట్ కమిటీ అధికారులు, సివిల్ సప్లై సిబ్బంది, వ్యవసాయ శాఖ అధికారులు మరియు స్థానిక రైతులు పాల్గొన్నారు.

