గంజాయి అక్రమ రవాణాపై పోలీసుల ఉక్కుపాదం
నాకాబందీలో 2.4 కిలోల గంజాయి స్వాధీనం
కారు సీజ్.. ఇద్దరు నిందితులు పరారీ
పోలీసులను అభినందించిన ఎస్పీ శబరీష్
కాకతీయ, నెల్లికుదురు : చట్టవ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్న అక్రమార్కులను నెల్లికుదురు పోలీసులు చాకచక్యంగా పట్టుకున్నారు. నాకాబంది సందర్భంగా గంజాయితో వెళ్తున్న నిందితులను అదుపులోకి తీసుకుని 2 కిలోల 395 గ్రాముల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. ఈ ఘటన మహబూబాబాద్ జిల్లా నెల్లికుదురు మండలంలో చోటుచేసుకుంది. ఈ మేరకు కేసముద్రం సీఐ సత్యనారాయణ, నెల్లికుదురు ఎస్సై చిర్ర రమేష్ బాబుతో కలిసి బుధవారం స్థానిక పోలీస్ స్టేషన్లో నిర్వహించిన విలేకరుల సమావేశంలో వివరాలు వెల్లడించారు. వివిధ ప్రాంతాలకు చెందిన ఏదుల రాజ్‌కుమార్, మాలేగోని ఆంజనేయులు అలియాస్ రామ్‌చందర్, రామ్గోని రాజేష్, రాజ్ అలియాస్ ఎఫ్‌జెడ్ హైదరాబాద్‌లో ఉంటూ స్నేహంగా తిరుగుతుండేవారని తెలిపారు. వీరికి గంజాయి సేవించే అలవాటు ఉండటంతో పాటు తక్కువ సమయంలో ఎక్కువ డబ్బు సంపాదించాలనే దురాలోచనతో గంజాయి కొనుగోలు చేసి హైదరాబాద్‌లో విక్రయిస్తున్నట్లు వెల్లడించారు. భద్రాచలం ప్రాంతానికి వెళ్లి రాజేష్ వద్ద నుంచి తక్కువ ధరకు గంజాయి కొనుగోలు చేసిన నిందితులు కారులో హైదరాబాద్‌కు తరలిస్తుండగా, జిల్లా ఎస్పీ డా. శబరీష్ ఆదేశాల మేరకు మంగళవారం రాత్రి పార్వతమ్మగూడెం స్టేజ్ సమీపంలోని ఎంకేఆర్ గార్డెన్ వద్ద పోలీసులు వాహన తనిఖీలు నిర్వహించారు. అనుమానాస్పదంగా ఉన్న కారును తనిఖీ చేయగా గంజాయి బయటపడింది. స్వాధీనం చేసుకున్న గంజాయి విలువ రూ.1,19,750 ఉంటుందని పోలీసులు తెలిపారు.
పరారీలో ఇద్దరు నిందితులు
గంజాయితో పాటు కారును సీజ్ చేసి సంబంధిత వ్యక్తులపై కేసు నమోదు చేసినట్లు సీఐ సత్యనారాయణ తెలిపారు. రాజ్, రాజేష్ పరారీలో ఉన్నారని, వారిని త్వరలోనే పట్టుకుంటామని చెప్పారు. యువత గంజాయి, డ్రగ్స్ వంటి మాదకద్రవ్యాలకు దూరంగా ఉండాలని సూచించారు. చట్టవ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. నిషేధిత గంజాయిని చాకచక్యంగా పట్టుకున్నందుకు సీఐ సత్యనారాయణ, ఎస్సై చిర్ర రమేష్ బాబు, సంబంధిత పోలీసు సిబ్బందిని మహబూబాబాద్ ఎస్పీ డా. శబరీష్, డీఎస్పీ ఎన్. తిరుపతిరావు అభినందించినట్లు సీఐ తెలిపారు.

