నిర్ణీత గడువులోగా పార్కు పనులు పూర్తి కావాలి
రోడ్లు, డ్రైనేజీ నిర్మాణాల్లో నాణ్యతా ప్రమాణాలు పాటించాలి
ఖమ్మం మునిసిపల్ కమిషనర్ అభిషేక్ అగస్త్య
ఇంజనీరింగ్ అధికారులతో కలిసి అభివృద్ధి పనుల తనిఖీ
కాకతీయ, ఖమ్మం బ్యూరో: ఖమ్మం నగరపాలక సంస్థ పరిధిలో సాగుతున్న వివిధ అభివృద్ధి పనులను మున్సిపల్ కమిషనర్ అభిషేక్ అగస్త్య బుధవారం ఇంజనీరింగ్ అధికారులతో కలిసి ఆకస్మికంగా తనిఖీ చేశారు. నగరంలోని పలు డివిజన్లలో పర్యటించి పనుల పురోగతిని క్షేత్రస్థాయిలో పరిశీలించారు. నగరంలోని 35వ డివిజన్లో గల పార్కును సందర్శించిన కమిషనర్.. అక్కడ జరుగుతున్న అభివృద్ధి పనులను పరిశీలించారు. పార్కులో చేపట్టాల్సిన మరికొన్ని పనులు, చేయాల్సిన మార్పులు, సౌకర్యాల మెరుగుదలపై ఇంజినీరింగ్ అధికారులకు దిశానిర్దేశం చేశారు. పార్కు పనులన్నింటినీ నిర్ణీత గడువులోగా పూర్తి చేసి స్థానిక ప్రజలకు అందుబాటులోకి తీసుకురావడానికి చర్యలు వేగవంతం చేయాలని అధికారులను సూచించారు.
నాణ్యత లోపిస్తే చర్యలు తప్పవు
అనంతరం 34వ డివిజన్ పరిధిలోని మూడో పట్టణ పోలీస్ స్టేషన్ సమీపంలో జరుగుతున్న రోడ్లు, డ్రెయినేజీ పనులను కమిషనర్ పరిశీలించారు. నిర్మాణ పనులు నాణ్యతా ప్రమాణాలకు అనుగుణంగా జరుగుతున్నాయా లేదా, కొలతలు మరియు సాంకేతిక నిబంధనలు సక్రమంగా పాటిస్తున్నారా అనే అంశాలను నిశితంగా తనిఖీ చేశారు. అదేవిధంగా 2వ డివిజన్లో జరుగుతున్న సీసీ రోడ్లు, డ్రెయిన్ల నిర్మాణ పనులను పరిశీలించి నాణ్యతను సమీక్షించారు. పనులన్నీ నిబంధనల ప్రకారం, ప్రజలకు దీర్ఘకాలిక ప్రయోజనం కలిగే విధంగా అత్యుత్తమ నాణ్యతతో నిర్వహించాలని మున్సిపల్ ఇంజనీరింగ్ అధికారులను కమిషనర్ అభిషేక్ అగస్త్య ఆదేశించారు.

