విమానాశ్రయం పనులకు టెండర్లు
రెండు ప్రధాన విభాగాలకు తొమ్మిది సంస్థల పోటాపోటీగా బిడ్లు
180 రోజుల్లో పనులు పూర్తి చేసేలా ప్రణాళిక
ప్రాథమిక పనులు, భూసార పరీక్షలతో వేగవంతమైన ఏర్పాట్లు
ఏఏఐ అధికారుల పర్యటన తర్వాత వేగం పుంజుకున్న ప్రక్రియ
కాకతీయ,వరంగల్ ప్రతినిధి : ఎన్నో ఏళ్ల నిరీక్షణకు తెరదించుతూ, వరంగల్ మామునూరు విమానాశ్రయ అభివృద్ధి పనుల్లో కీలక అడుగు పడింది. ఎయిర్‌పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా అధికారులు ఇటీవల ఇక్కడ పర్యటించిన అనంతరం అభివృద్ధి పనులను వేగవంతం చేశారు. విమానాశ్రయ ప్రాంగణంలో చేపట్టాల్సిన ప్రాథమిక పనులు, భూసార పరీక్షలు మరియు పర్యావరణ అనుమతుల కోసం అధికారులు ఆహ్వానించిన టెండర్ల ప్రక్రియ విజయవంతంగా ముగిసింది. మంగళవారం సాయంత్రం 4 గంటలతో గడువు ముగియగా, మొత్తం 9 సంస్థలు ఈ టెండర్లలో పాల్గొన్నాయి.
పోటాపోటీగా బిడ్లు
మామునూరు ఎయిర్‌పోర్ట్ అభివృద్ధిలో భాగంగా ప్రధానంగా రెండు విభాగాలకు టెండర్లు పిలవగా, ఆయా సంస్థల నుంచి విశేష స్పందన లభించింది. విమానాశ్రయంలో రన్వే, ఇతర నిర్మాణాల కోసం నిర్వహించాల్సిన భూసార పరీక్షల కోసం 4 సంస్థలు టెండర్లు దాఖలు చేశాయి. ఎయిర్‌పోర్ట్ ఏర్పాటుకు అవసరమైన పర్యావరణ అనుమతుల కోసం కన్సల్టెన్సీ సేవలకు 5 సంస్థలు బిడ్లు వేశాయి.
ప్రస్తుతం ఈ 9 టెండర్లు స్క్రూటినీ (పరిశీలన) దశలో ఉన్నట్లు టెక్నికల్ వింగ్ పోర్టల్ ద్వారా వెల్లడైంది.
క్షేత్రస్థాయిలో చేపట్టబోయే పనులు
టెండర్ల ప్రక్రియ ఫైనల్ అయిన వెంటనే క్షేత్రస్థాయిలో పనులు ప్రారంభం కానున్నాయి. ముఖ్యంగా భూ నిర్వాసితుల నుండి సేకరించిన రన్వే స్థలం చుట్టూ ఫెన్సింగ్ ఏర్పాటు చేసి, ఎయిర్‌పోర్ట్ అథారిటీ బోర్డులను ఉంచనున్నారు. అలాగే, విమానాశ్రయ ప్రాంగణంలో ఏపుగా పెరిగిన ముళ్లపొదలు, అనవసరపు చెట్లను పూర్తిగా తొలగించి, ప్రాంగణాన్ని శుభ్రం చేయనున్నారు. ఆ తర్వాత ఎయిర్‌పోర్ట్ నిర్మాణానికి అనుకూలతలపై సమగ్ర నివేదికలు సిద్ధం చేస్తారు. ఈ టెండర్లను దక్కించుకునే కాంట్రాక్టర్ లేదా కన్సల్టెన్సీ సంస్థలు నిర్దేశిత గడువులోగా పనులను పూర్తి చేయాల్సి ఉంటుంది. ఆరు నెలల (180 రోజులు) వ్యవధిలో పర్యావరణ అనుమతులు సాధించడంతో పాటు, భూసార పరీక్షల నివేదికలను ప్రభుత్వానికి సమర్పించాల్సి ఉంటుందని అధికారులు స్పష్టం చేశారు. టెండర్లు త్వరలోనే ఫైనల్ కానుండటంతో మామునూరు విమానాశ్రయ కల సాకారం దిశగా వరంగల్ వాసుల్లో కొత్త ఆశలు చిగురిస్తున్నాయి.

