వ్యాపారిని బురిడీ కొట్టించిన దొంగలు
20 తులాల బంగారం, 4 కేజీల వెండి అపహరణ!
ఖమ్మం గాంధీ చౌక్‌లో రాత్రిపూట దారుణం
వ్యాపారి కదలికలపై రెక్కీ నిర్వహించి చేతివాటం ప్రదర్శించిన ముఠా
రంగంలోకి దిగి సీసీటీవీ ఫుటేజీలను పరిశీలిస్తున్న పోలీసులు
కాకతీయ, ఖమ్మం బ్యూరో : నగరంలోని అత్యంత రద్దీగా ఉండే మూడో పట్టణ పోలీస్ స్టేషన్ (త్రీటౌన్) పరిధిలోని గాంధీ చౌక్‌లో బుధవారం రాత్రి భారీ దొంగతనం జరిగింది. ఓ హోల్‌సేల్ స్వర్ణ వ్యాపారిని బురిడీ కొట్టించిన కేరళ/స్థానిక దొంగల ముఠా.. బైక్‌పై ఉన్న బ్యాగును క్షణాల వ్యవధిలో తస్కరించింది. బాధితుడి ఫిర్యాదుతో త్రీటౌన్ పోలీసులు రంగంలోకి దిగి దర్యాప్తు ప్రారంభించారు. స్థానికులు, బాధితుడు తెలిపిన వివరాల ప్రకారం.. నగరానికి చెందిన ప్రముఖ హోల్‌సేల్ బంగారం వ్యాపారి కార్తీక్ బుధవారం రాత్రి 8:30 నుండి 9:00 గంటల ప్రాంతంలో గాంధీ చౌక్‌లోని తన దుకాణాన్ని మూసివేసి ఇంటికి బయలుదేరాడు. దారిలో ఓ టిఫిన్ బండి వద్దకు వచ్చి, బైక్ ఆపి దానిపై సుమారు 20 తులాల బంగారం, 4 కేజీల వెండి వస్తువులు ఉన్న బ్యాగ్‌ను ఉంచాడు. అనంతరం టిఫిన్ ఆర్డర్ ఇచ్చి తింటుండగా.. అప్పటికే అతని కదలికలపై ‘రెక్కీ’ నిర్వహించిన ఓ దొంగ నెమ్మదిగా బైక్ వద్దకు వచ్చి బ్యాగును చేజిక్కించుకున్నాడు.

చిన్నారి చెప్పినా.. దొరకని దొంగ
నిందితుడు బ్యాగ్ ఎత్తుకెళ్తుండటాన్ని పక్కనే ఉన్న ఓ చిన్నారి గమనించింది. వెంటనే వ్యాపారి కార్తీక్ వద్దకు వెళ్లి “అంకుల్.. ఎవరో మీ సంచిని ఎత్తుకెళ్తున్నారు” అని చెప్పింది. దాంతో అప్రమత్తమైన కార్తీక్ గట్టిగా కేకలు వేస్తూ దొంగను పట్టుకునేందుకు పరుగెత్తాడు. అయితే, అప్పటికే రోడ్డుపై మరో బైక్‌ను సిద్ధంగా ఉంచుకున్న తన స్నేహితుడితో కలిసి నిందితుడు క్షణాల్లో అక్కడి నుండి పరారయ్యాడు.
సీసీ కెమెరాల ఆధారంగా వేట
బాధితుడు కార్తీక్ వెంటనే త్రీటౌన్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. సీఐ ఆదేశాల మేరకు ఎస్సై కొండలరావు తన సిబ్బందితో కలిసి వెంటనే సంఘటనా స్థలానికి చేరుకుని విచారణ చేపట్టారు. కేసు నమోదు చేసిన పోలీసులు.. గాంధీ చౌక్ పరిసర ప్రాంతాల్లో, టిఫిన్ బండి వద్ద ఉన్న సీసీటీవీ కెమెరాల ఫుటేజీలను క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు. పక్కా ప్లాన్ ప్రకారమే ఈ చోరీ జరిగినట్లు భావిస్తున్నామని, త్వరలోనే నిందితులను పట్టుకుంటామని ఎస్సై తెలిపారు. రద్దీ ప్రాంతంలో ఇంత పెద్ద మొత్తంలో బంగారం, వెండి చోరీకి గురికావడం స్థానిక వ్యాపారుల్లో ఆందోళన రేకెత్తిస్తోంది.

