గుంపు మేస్త్రీ హఠావో.. తెలంగాణ బచావో!
ఆయన అధికారంలోకి వచ్చాకా అన్ని వర్గాలు ఆగం
సెంట్రింగ్ కార్మికుల సమస్యలు పరిష్కరించాలి
లేదంటే సమస్య తీరే వరకు నేనే ధర్నాలో కూర్చుంటా
సెంట్రింగ్ కార్మికుల 12 డిమాండ్లు పూర్తిగా సహేతుకమైనవే
పట్టించుకోకపోతే జీహెచ్ఎంసీ ఎన్నికల్లో ప్రభుత్వానికి వాత తప్పదు
తెలంగాణ రక్షణ సేన చీఫ్ కల్వకుంట్ల కవిత
కాకతీయ, హైదరాబాద్ : తెలంగాణలో గుంపు మేస్త్రీ అధికారంలోకి వచ్చాక అన్ని వర్గాల ప్రజలు ఇబ్బంది పడుతున్నారని తెలంగాణ రక్షణ సేన (టీఆర్ఎస్) చీఫ్ కల్వకుంట్ల కవిత విమర్శించారు. అందుకే తాను ‘గుంపు మేస్త్రీ హఠావో…. తెలంగాణ బచావో’ అనే నినాదం ఇస్తున్నట్లు స్పష్టం చేశారు. ఇందిరాపార్క్ వద్ద ధర్నాకు దిగిన సెంట్రింగ్ కార్మికులతో ప్రభుత్వం తక్షణమే చర్చలు జరిపి, వారి సమస్యలను రెండు రోజుల్లో పరిష్కరించాలని తెలంగాణ రక్షణ సేన చీఫ్ కల్వకుంట్ల కవిత డిమాండ్ చేశారు. లేనిపక్షంలో కార్మికులకు అండగా సమస్య పరిష్కారమయ్యే వరకు ఎన్ని రోజులైనా తానే స్వయంగా ధర్నాలో కూర్చుంటానని ఆమె స్పష్టం చేశారు. 12 ప్రధాన డిమాండ్లతో ఇందిరాపార్క్ వద్ద నిరసన చేపట్టిన సెంట్రింగ్ కార్మికుల ధర్నా శిబిరానికి శనివారం కవిత చేరుకుని వారికి సంపూర్ణ మద్దతు ప్రకటించారు. ఈ సందర్భంగా కవిత మాట్లాడుతూ హైదరాబాద్ నగర నిర్మాణంలో సెంట్రింగ్ కార్మికుల పాత్ర మరువలేనిదన్నారు. ఆకాశహర్మ్యాలు, అద్దాల మేడల వెనుక వారి శ్రమ దాగి ఉందని కొనియాడారు. ప్రాణాలను పణంగా పెట్టి గాలిలో వేలాడుతూ పనిచేసే కార్మికులను ఈ ప్రభుత్వం నిర్లక్ష్యం చేయడం అన్యాయమన్నారు. గుంపు మేస్త్రీ అధికారంలోకి వచ్చిన తర్వాత అన్ని వర్గాల ప్రజలు ఆగమావుతున్నారని, అందుకే ‘గుంపు మేస్త్రీ హఠావో… తెలంగాణ బచావో’ అనే నినాదంతో ముందుకు వెళ్తున్నామని చెప్పారు. కార్మికుల న్యాయమైన డిమాండ్లను విస్మరిస్తే రాబోయే జీహెచ్ఎంసీ ఎన్నికల్లో కాంగ్రెస్ ప్రభుత్వానికి ప్రజలు కర్రుకాల్చి వాత పెట్టడం ఖాయమని హెచ్చరించారు.
కార్మికుల డిమాండ్లు సహేతుకమైనవే
భవన నిర్మాణ ఒప్పందాల్లో సెంట్రింగ్ కార్మికుల పేరుతో అగ్రిమెంట్లు ఉండటం లేదని కవిత ఆవేదన వ్యక్తం చేశారు. కార్మికులకు ఈఎస్ఐ కార్డులు ఇవ్వాలని, స్క్వేర్ ఫీట్‌కు 51 రూపాయల కూలీ నిర్ణయించాలని, ప్రమాదవశాత్తు కార్మికుడు చనిపోతే ఇచ్చే పరిహారాన్ని 10 లక్షల నుంచి 20 లక్షల రూపాయలకు పెంచాలని వారు కోరుతున్నారని తెలిపారు. కార్మికులేమీ గొంతెమ్మ కోరికలు కోరడం లేదని, ప్రభుత్వం మనసు పెడితే రెండు రోజుల్లోనే ఈ సమస్యలు పరిష్కారం అవుతాయన్నారు. 2 లక్షల రూపాయల పని కోసం 15 లక్షల రూపాయల విలువైన మెటీరియల్‌ను తీసుకెళ్లాల్సి వస్తోందని, కానీ వాటికి రక్షణ లేని పరిస్థితి నెలకొందని ఆందోళన వ్యక్తం చేశారు. రాష్ట్రంలో తెలంగాణ రక్షణ సేన అధికారంలోకి వచ్చిన వెంటనే సెంట్రింగ్ కార్మికులు, యాజమాన్యాలు కోరుతున్న అన్ని డిమాండ్లను పరిష్కరిస్తామని కవిత హామీ ఇచ్చారు. హైదరాబాద్ నగరంలో 86 చోట్ల వెయ్యి నుంచి రెండు వేల గజాల స్థలాన్ని కార్మికుల కోసం కేటాయిస్తామని వెల్లడించారు. ప్రతి మండలంలోనూ సెంట్రింగ్ కార్మికుల సంఘాలు ఏర్పాటు కావాల్సిన అవసరం ఉందన్నారు. కార్మికులు అధైర్యపడకుండా తమ హక్కుల సాధన కోసం పోరాడాలని, వారికి తమ పార్టీ ఎల్లప్పుడూ అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. కార్యక్రమంలో సెంట్రింగ్ కార్మిక సంఘాల నాయకులు, కార్మికులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

