ఐటిడిఏలో ఉచిత వైద్య శిబిరం
ఉద్యోగుల ఆరోగ్యంపై దృష్టి
63 మందికి స్క్రీనింగ్ పరీక్షలు
కాకతీయ, ఏటూరునాగారం : విధి నిర్వహణలో ప్రభుత్వ ఉద్యోగులు ఎదుర్కొనే ఒత్తిడిని దృష్టిలో ఉంచుకుని ఐటిడిఏ కార్యాలయంలో శనివారం ఉచిత వైద్య శిబిరం నిర్వహించారు. ప్రాజెక్ట్ అధికారి లెనిన్ వత్సల్ టోప్పో ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో ఉద్యోగులు, వారి కుటుంబ సభ్యులు, సందర్శకులకు పలు రకాల వైద్య పరీక్షలు నిర్వహించారు. జిల్లా ఉప వైద్య ఆరోగ్య శాఖ అధికారి డా. కోరం క్రాంతి కుమార్ పర్యవేక్షణలో బీపీ, షుగర్, సీబీపీ తదితర స్క్రీనింగ్ పరీక్షలు చేపట్టారు. మొత్తం 63 మంది ఉద్యోగులు ఈ పరీక్షలు చేయించుకున్నారు. ఆరోగ్య సమస్యలను ప్రారంభ దశలోనే గుర్తించడంలో స్క్రీనింగ్ కీలకమని వైద్యులు పేర్కొన్నారు. ఈ సందర్భంగా ప్రాజెక్ట్ అధికారి మాట్లాడుతూ ఆరోగ్యంగా ఉన్నప్పటికీ అంతర్గత సమస్యలు తెలియకపోవచ్చని ప్రతి ఉద్యోగి క్రమం తప్పకుండా షుగర్, బీపీ వంటి పరీక్షలు చేయించుకోవాలని సూచించారు. పరీక్షల్లో ఏవైనా సమస్యలు గుర్తించిన పక్షంలో మెరుగైన చికిత్స కోసం పెద్ద ఆసుపత్రులకు రిఫర్ చేసే చర్యలు తీసుకుంటామని తెలిపారు. ఈ కార్యక్రమంలో అసిస్టెంట్ ప్రాజెక్ట్ అధికారి నాగోరావు, డిప్యూటీ డైరెక్టర్ జనార్ధన్, గైనకాలజిస్టు డా. అరవింద, పిల్లల వైద్యులు డా. స్రవంతి, జనరల్ ఫిజీషియన్ డా. సుదీర్ రెడ్డి తదితర వైద్యులు, సిబ్బంది పాల్గొన్నారు.

