పట్టాలున్నా పాస్‌బుక్కులు లేవు!
పోడు రైతుల తీవ్ర ఆవేదన
బ్యాంకు రుణాలు రాక, అటవీశాఖతో తప్పని ఇబ్బందులు
ఐటీడీఏ ఏపీఓకు గిరిజన సంఘం వినతిపత్రం
కాకతీయ, ఏటూరునాగారం : ఆర్‌ఓఎఫ్‌ఆర్ పట్టాలు మంజూరై ప్రభుత్వ పథకాల ప్రయోజనాలు అందుతున్నప్పటికీ, ఇప్పటివరకు చేతికి పట్టా పాస్‌బుక్కులు జారీ కాకపోవడంతో పోడు సాగు రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. తక్షణమే పాస్‌బుక్కులు అందించకపోతే ఆందోళనలకు దిగుతామని తెలంగాణ ఆదివాసి గిరిజన సంఘం ములుగు జిల్లా అధ్యక్షుడు దుగ్గి చిరంజీవి హెచ్చరించారు. సోమవారం గ్రీవెన్స్ డే సందర్భంగా ఏటూరునాగారం ఐటీడీఏ కార్యాలయంలో ఆయన ఏపీఓను కలిసి వినతిపత్రం సమర్పించారు.
భూమిపై చెల్లుబాటు ఆధారం ఏది?
రికార్డుల్లో ఆర్‌ఓఎఫ్‌ఆర్ నంబర్లు నమోదై రైతు భరోసా అందుతున్న రైతులందరికీ వెంటనే అధికారిక పట్టా పాస్‌బుక్కులు జారీ చేయాలని చిరంజీవి డిమాండ్ చేశారు. తాడ్వాయి మండలం గంగారం గ్రామపంచాయతీకి చెందిన గౌరబోయిన పరమయ్యతో పాటు సుమారు 30 మంది రైతులకు పట్టాలు ఉన్నప్పటికీ పాస్‌బుక్కులు ఇవ్వకపోవడం అన్యాయమన్నారు. వీటి కొరత వల్ల బ్యాంకు రుణాలు పొందడం అసాధ్యంగా మారిందని, క్షేత్రస్థాయిలో అటవీశాఖ అధికారులతో అనవసర ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు. వ్యవసాయానికి అవసరమైన సబ్సిడీలు, ఇతర ప్రభుత్వ ప్రయోజనాలు పొందడంలో కూడా ఆటంకాలు నెలకొంటున్నాయని తెలిపారు. రికార్డుల్లో హక్కులు ఉన్నప్పటికీ చేతిలో బలమైన ఆధారం లేక రైతులు నష్టపోతున్నారన్నారు. జిల్లా కలెక్టర్, ఐటీడీఏ ప్రాజెక్ట్ అధికారి స్పందించి వెంటనే పాస్‌బుక్కులు లేదా ప్రత్యామ్నాయ పత్రాలు అందించాలని, లేదంటే గిరిజన సంఘం ఆధ్వర్యంలో పోడు రైతులను సమీకరించి పెద్ద ఎత్తున ఆందోళనలు చేపడతామని హెచ్చరించారు.

