పల్లెలకు కేంద్రం నిధులు
9వేల కోట్లతో పంచాయతీలకు మహర్దశ
పదహారో ఆర్థిక సంఘం నిధులతో పంచాయతీలకు ఊరట
5ఏళ్ల కాలం నాటికి 9968 కోట్ల నిధులు మంజూరు
పాలకవర్గాలు లేక స్తంభించిన పల్లె ప్రగతి
కేంద్రం తాజా నిధులతో మారనున్న రూపురేఖలు
మౌలిక వసతులకే ఖర్చు చేయాలని కేంద్రం ఆదేశాలు
కాకతీయ, కొత్తగూడెం : రాష్ట్రంలోని గ్రామపంచాయతీలు ఎదుర్కొంటున్న తీవ్ర ఆర్థిక సంక్షోభానికి తెరదించుతూ కేంద్ర ప్రభుత్వం పల్లెలకు భారీ నజరానా ప్రకటించింది. క్షేత్రస్థాయిలో గ్రామీణ స్థానిక సంస్థలను బలోపేతం చేయడమే లక్ష్యంగా కేంద్ర 16వ ఆర్థిక సంఘం రికార్డు స్థాయిలో నిధులను కేటాయించింది. కొంతకాలంగా పాలక వర్గాలు లేకపోవడం, రాష్ట్ర నిధుల విడుదల నిలిచిపోవడంతో వీధి దీపాలు, తాగునీటి సరఫరా, పారిశుద్ధ్యం వంటి కనీస సేవలను కూడా అందించలేక పంచాయతీలు చేతులెత్తేసిన దుస్థితి నెలకొంది. ఈ దీనస్థితిని గమనించిన కేంద్రం, 2026-27 నుంచి 2030-31 వరకు ఐదేళ్ల కాలానికి గాను తెలంగాణకు ఏకంగా రూ. 9,968 కోట్ల నిధులను మంజూరు చేస్తూ కీలక ఉత్తర్వులు జారీ చేసింది.
నిధుల మళ్లింపునకు బ్రేక్
గతంలో కేంద్ర నిధులను రాష్ట్ర ప్రభుత్వాలు తమ అవసరాలకు అనుగుణంగా ఇతర పథకాలకు దారిమళ్లించాయనే ఆరోపణలు వెల్లువెత్తాయి. ఈ నేపథ్యంలోనే 16వ ఆర్థిక సంఘం నిధుల వినియోగంపై కేంద్రం ఈసారి అత్యంత స్పష్టమైన, కఠినమైన మార్గదర్శకాలను జారీ చేసింది. ఈ నిధులను కేవలం గ్రామపంచాయతీల మౌలిక సదుపాయాల అభివృద్ధి, తాగునీటి సరఫరా, పారిశుద్ధ్యం, వ్యర్థాల నిర్వహణ, గ్రామీణ రహదారులు, వీధి దీపాల ఏర్పాటు వంటి ప్రజా సేవలకే ఖచ్చితంగా వినియోగించాలని స్పష్టం చేసింది. అంతేకానీ, స్థానిక సంస్థల్లో పనిచేసే ప్రభుత్వ ఉద్యోగుల వేతనాలు, పెన్షన్ల చెల్లింపుల కోసం ఈ నిధులను ఎట్టి పరిస్థితుల్లోనూ ముట్టకూడదని ఢిల్లీ పెద్దలు హుకుం జారీ చేశారు. నిధుల దుర్వినియోగాన్ని అరికట్టేందుకు ప్రతి త్రైమాసిక, వార్షిక పురోగతి నివేదికలను రాష్ట్ర ప్రభుత్వం కేంద్రానికి సమర్పించాల్సి ఉంటుంది. ఆడిట్లలో ఏ చిన్న అవకతవకలు తేలినా చట్టపరమైన కఠిన చర్యలు తీసుకోవాలని రాష్ట్రానికి ఆదేశాలు జారీ అయ్యాయి.
జనాభా, వైశాల్యం లెక్కలతోనే నిధులు
దేశవ్యాప్తంగా 16వ ఆర్థిక సంఘం ఐదేళ్ల కాలానికి రూ. 4,35,236 కోట్ల గ్రాంట్లను ప్రకటించగా, అందులో 80 శాతం నిధులు నేరుగా గ్రామపంచాయతీలకు, 10 శాతం మండల పరిషత్‌లకు, మరో 10 శాతం జిల్లా పరిషత్‌లకు కేటాయించనున్నారు. ప్రతి ఏడాది జూన్, అక్టోబర్ నెలల్లో రెండు విడతలుగా ఈ నిధులను నేరుగా స్థానిక సంస్థల ఖాతాల్లోనే జమ చేయనున్నారు. 2026 నాటి అంచనాల ప్రకారం.. గ్రామీణ జనాభాకు 90 శాతం, రాష్ట్ర వైశాల్యానికి 10 శాతం వెయిటేజీ ఇవ్వగా, తెలంగాణకు గ్రామీణ జనాభా ఆధారంగా 1.92 శాతం, వైశాల్యం ఆధారంగా 0.37 శాతం వాటా లభించింది. ఈ సమీకరణాల వల్లే రాష్ట్రానికి రూ. 9,968 కోట్ల భారీ నిధులు మంజూరయ్యాయి. ఈ నిధులను సక్రమంగా వినియోగించుకుంటేనే రాబోయే రోజుల్లో తెలంగాణ పల్లెలకు నిజమైన మహర్దశ పడుతుందని, లేదంటే నిధులు ఉండి కూడా వాడుకోలేని అసమర్థత పాలకవర్గాలపై పడుతుందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.

