భూములకు రక్షణ కల్పించేంత వరకు ఉద్యమం
వచ్చే నెలలో ముళ్లకట్ట నుంచి రామన్నగూడెం వరకు పాదయాత్ర
బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు కాకుమర్రి లక్ష్మీ నరసింహారావు
కాకతీయ, ఏటూరునాగారం : గోదావరి ముంపుతో నష్టపోతున్న రైతుల భూములకు శాశ్వత రక్షణ కల్పించే వరకు ఉద్యమాన్ని కొనసాగిస్తామని బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు కాకుమర్రి లక్ష్మీనరసింహారావు తెలిపారు. మంగళవారం ఏటూరునాగారం మండల కేంద్రంలోని తన నివాసంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ముళ్లకట్ట నుంచి రామన్నగూడెం వరకు కోట్లాది రూపాయల విలువైన వ్యవసాయ భూములు గోదావరి ప్రవాహంలో కలిసిపోతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రతి వర్షాకాలంలో వరదల కారణంగా వేలాది మంది రైతులు పంట భూములను కోల్పోతుండటంతో పాటు, వ్యవసాయ బోర్లు కూడా మట్టిలో కలిసిపోతున్నాయని అన్నారు.
వ్యవసాయ భూముల రక్షణ కోసం పాదయాత్ర
వ్యవసాయ భూముల రక్షణ కోసం ముళ్లకట్ట నుంచి రామన్నగూడెం వరకు పాదయాత్ర చేపడతామని లక్ష్మీనరసింహారావు ప్రకటించారు. గోదావరి ఒడ్డున కాంక్రీట్ వాల్ నిర్మాణం చేపట్టాలని డిమాండ్ చేస్తూ రైతులతో కలిసి పోరాటాన్ని మరింత ఉధృతం చేస్తామని తెలిపారు. అవసరమైతే ఏటూరునాగారం నుంచి హైదరాబాద్ వరకు కూడా పాదయాత్ర నిర్వహించేందుకు వెనుకాడబోమన్నారు. జూన్ నెలలో పలు ఉద్యమాలకు కార్యాచరణ సిద్ధం చేస్తున్నామని, కేంద్ర–రాష్ట్ర ప్రభుత్వాలు వెంటనే స్పందించి రైతుల భూములకు రక్షణ కల్పించాలని డిమాండ్ చేశారు. రైతుల కష్టాలు తనకు బాగా తెలుసని, వేలాది ఎకరాల భూమి గోదావరిలో కలిసిపోతున్నప్పటికీ ఇరిగేషన్ శాఖ, ప్రభుత్వం స్పందించడం లేదని విమర్శించారు. అవసరమైతే మంత్రి సీతక్కను కలిసి సమస్యను వివరిస్తామని తెలిపారు. రైతుల సమస్య పరిష్కారానికి పార్టీలకు అతీతంగా అందరూ కలిసి రావాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో రైతులు ఎగ్గడి కోటయ్య, సాయిని మహేష్, అల్లి చిట్టి, బీఆర్ఎస్ నాయకులు వలిబాబా, యలవర్తి శ్రీనివాస్, కావిరి చిన్ని కృష్ణ, తాడూరి రఘు, తాటి కృష్ణ, కూనూరు అశోక్, దడిగల సమ్మయ్య, తుమ్మ మల్లారెడ్డి, గడదాసు సునీల్, ఉపసర్పంచ్ ఎల్లయ్య, వార్డు సభ్యులు పాల్గొన్నారు.

