కలెక్టర్ కక్ష సాధింపు చర్యలు
జనగామ కలెక్టర్‌పై న్యాయవాది సాధిక్ ఆరోపణలు
న్యాయం చేయాలంటూ ఆమరణ దీక్ష.. సీపీఎం, బీఆర్‌ఎస్ నాయకుల మద్దతు
కాకతీయ, జనగామ : జనగామ జిల్లా కలెక్టర్ తనపై వ్యక్తిగత వేధింపులకు, కక్షసాధింపు చర్యలకు పాల్పడుతున్నారని ఆరోపిస్తూ పట్టణానికి చెందిన హైకోర్టు న్యాయవాది ఎండి సాధిక్ అలీ ఆమరణ నిరాహార దీక్షకు దిగారు. కత్తుల రాజిరెడ్డి వ్యవహారంలో కలెక్టర్‌కు వ్యతిరేకంగా తానే హైకోర్టులో వాదనలు వినిపించానని, ప్రజా సమస్యలపై ప్రశ్నించినందుకే తనపై ఒత్తిడి పెంచారని ఆయన ఆరోపించారు. ఈ విషయాన్ని ఇన్‌చార్జి మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి, ఎమ్మెల్యే కడియం శ్రీహరి, ఎమ్మెల్సీలు ప్రొఫెసర్ కోదండరాం, తీన్మార్ మల్లన్నల దృష్టికి తీసుకెళ్లినట్లు సాధిక్ అలీ పేర్కొన్నారు. అయినా, ఈ నెల 19న తనపై నిషేధాజ్ఞలు విధించి, సమీకృత కలెక్టరేట్‌లోని వినియోగదారుల సమాచార కేంద్రాన్ని మూసివేయించడంతో పాటు తనను ఇన్‌చార్జి బాధ్యతల నుంచి తొలగించారని మండిపడ్డారు. తాజాగా రెవెన్యూ, మున్సిపల్ అధికారులు తన ఇంటికి వచ్చి కొలతలు తీసి, ఇల్లు కూల్చివేస్తామని హెచ్చరించారని, దీంతో తన 90 ఏళ్ల తండ్రి గోరేమియా సహా తల్లిదండ్రులు భయాందోళనకు గురయ్యారని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వ కక్షసాధింపు చర్యలపై వెంటనే స్పందించాలని డిమాండ్ చేశారు. సాధిక్ అలీ దీక్షకు సీపీఎం జిల్లా కార్యదర్శి మోకు కనకారెడ్డి, నాయకులు బొట్ల శేఖర్, జోగు ప్రకాష్, బీఆర్‌ఎస్ నాయకులు ఎండి సాజిద్ కమర్, యాకూబ్ పాషా తదితరులు మద్దతు ప్రకటించారు.

