గురుకులాల్లో సీట్ల భర్తీకి భారీ స్పందన
ఫేజ్-1లోనే 18401 సీట్లు భర్తీ
ఎంపికైన విద్యార్థులు జూన్ 7లోపు ప్రవేశాలు పూర్తి చేసుకోవాలి
జేఈఈ మెయిన్స్-2026లో 337 మంది గురుకుల విద్యార్థుల అర్హత
సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ వెల్లడి
పేద విద్యార్థులకు నాణ్యమైన విద్య అందించడమే ప్రభుత్వ లక్ష్యం
రాష్ట్ర ఎస్సీ, ఎస్టీ సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్
కాకతీయ,తెలంగాణ బ్యూరో : తెలంగాణ సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ ఎడ్యుకేషనల్ ఇన్‌స్టిట్యూషన్స్ సొసైటీ ఆధ్వర్యంలో 2026-27 విద్యా సంవత్సరానికి సంబంధించి సైనిక పాఠశాలలు, సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్, నాన్-సీఓఈ మరియు ఒకేషనల్ జూనియర్ కళాశాలల్లో ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరం ప్రవేశాల ఫలితాలను శుక్రవారం డాక్టర్ బీఆర్ అంబేద్కర్ రాష్ట్ర సచివాలయంలో రాష్ట్ర ఎస్సీ, ఎస్టీ సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ విడుదల చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి విద్యను సామాజిక మార్పుకు ప్రధాన సాధనంగా భావిస్తూ పేద, దళిత, గిరిజన, బడుగు బలహీన వర్గాల విద్యార్థులకు కార్పొరేట్ స్థాయి నాణ్యమైన విద్యను పూర్తిగా ఉచితంగా అందించేందుకు కట్టుబడి ఉన్నారని పేర్కొన్నారు. ఈ విద్యా సంవత్సరానికి సంబంధించి ఏప్రిల్ 5న ప్రవేశాల నోటిఫికేషన్ విడుదల చేయగా, ఏప్రిల్ 6 నుంచి మే 25 వరకు ఆన్‌లైన్ దరఖాస్తులను స్వీకరించారు. రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 45357 దరఖాస్తులు అందగా, అందులో ఎంపీసీ గ్రూప్‌కు 21447, బైపీసీ గ్రూప్‌కు 17400, ఎంఈసీ, సీఈసీ, హెచ్‌ఈసీ గ్రూపులకు కలిపి 6510 దరఖాస్తులు వచ్చినట్లు మంత్రి తెలిపారు. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న గురుకుల విద్యాసంస్థల్లో మొత్తం 19740 సీట్లు అందుబాటులో ఉండగా, మే 15న 117 పరీక్షా కేంద్రాల్లో నిర్వహించిన ప్రవేశ పరీక్షకు 39052 మంది విద్యార్థులు హాజరై 86.09 శాతం హాజరు నమోదైనట్లు వెల్లడించారు. ఫేజ్-1 అడ్మిషన్లలోనే మొత్తం 18401 సీట్లు భర్తీ కావడం గురుకులాలపై పెరుగుతున్న విశ్వాసానికి నిదర్శనమన్నారు. ఇంకా 1339 సీట్లు మాత్రమే మిగిలి ఉన్నాయని తెలిపారు.
గ్రూపుల వారీగా సీట్ల భర్తీ
వేలం పాట తరహాలో విద్యార్థులు గురుకులాల్లో చేరేందుకు ఆసక్తి చూపించడంతో మొదటి విడతలోనే 93.21 శాతం సీట్లు భర్తీ అయ్యాయి. ఎంపీసీలో 8440 సీట్లకు గాను 8156 సీట్లు, బైపీసీలో 8280 సీట్లకు గాను 7425 సీట్లు, ఎంఈసీలో 520 సీట్లకు గాను 377 సీట్లు భర్తీ అయ్యాయి. అలాగే సీఈసీలో 1520 సీట్లకు గాను 1500 సీట్లు, హెచ్‌ఈసీలో 280 సీట్లకు గాను 257 సీట్లు, ఒకేషనల్ కోర్సుల్లో 700 సీట్లకు గాను 686 సీట్లు భర్తీ అయినట్లు మంత్రి వివరించారు. ఫేజ్-1లో ఎంపికైన విద్యార్థులు అవసరమైన ధ్రువపత్రాలతో జూన్ 7లోపు సంబంధిత కళాశాలల్లో ప్రవేశాలు పూర్తి చేసుకోవాలని కోరారు. జూన్ 1 నుంచి కళాశాలలు ప్రారంభమవుతున్నందున విద్యార్థులను మొదటి రోజే కళాశాలలకు పంపించాలని విజ్ఞప్తి చేశారు.
జాతీయ స్థాయిలో అద్భుత ఫలితాలు
సోషల్ వెల్ఫేర్ గురుకులాలు నేడు జాతీయ స్థాయిలో అద్భుత ఫలితాలు సాధిస్తున్నాయని మంత్రి తెలిపారు. జేఈఈ మెయిన్-2026లో 337 మంది విద్యార్థులు అర్హత సాధించగా, అందులో 26 మంది 90 శాతం పైగా పర్సنتైల్ సాధించడం గర్వకారణమన్నారు. గత ఏడాది 525 మంది విద్యార్థులు జేఈఈ అడ్వాన్స్‌డ్‌కు అర్హత సాధించారని గుర్తుచేశారు. సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ కళాశాలలు ఐఐటీ-జేఈఈ, నీట్, ఎన్‌డీఏ, క్లాట్ వంటి పరీక్షల్లో కార్పొరేట్ కళాశాలలకు పోటీగా నిలుస్తున్నాయన్నారు. ప్రభుత్వం అమలు చేస్తున్న మైక్రో అకడమిక్ ప్లానింగ్, వారానికొకసారి మాక్ టెస్టులు, ప్రత్యేక అకడమిక్ మానిటరింగ్, నిపుణులైన అధ్యాపకులతో ప్రత్యేక శిక్షణ వల్ల ఫలితాలు గణనీయంగా మెరుగుపడుతున్నాయని మంత్రి వెల్లడించారు.
తల్లిదండ్రులతో ప్రతి నెల సమావేశాలు
గురుకులాలకు సంబంధించి పెండింగ్ బిల్లులు లేకుండా ప్రతి నెల మొదటి వారంలోనే బిల్లులు చెల్లించే విధంగా ప్రభుత్వం చారిత్రాత్మక నిర్ణయం తీసుకుందని మంత్రి పేర్కొన్నారు. ఇకపై ప్రతి నెల విద్యార్థుల తల్లిదండ్రులతో సమావేశాలు నిర్వహించి వారి సూచనలు, సలహాలు స్వీకరిస్తామని వెల్లడించారు. పేద కుటుంబాల పిల్లలను దేశ భవిష్యత్ శాస్త్రవేత్తలు, అధికారులు, నాయకులుగా తీర్చిదిద్దడమే లక్ష్యమన్నారు. ఈ కార్యక్రమంలో ఓఎస్డీ వై జే విజయ్ కుమార్, సొసైటీ కార్యదర్శి కంభంపాటి శారద, జాయింట్ సెక్రటరీ సక్రు నాయక్, అసిస్టెంట్ సెక్రటరీ మధు నాయక్, డిప్యూటీ సెక్రటరీ సహజ, సూపరింటెండెంట్ మృణాళిని, డీపీవో శ్రీకాంత్ తదితర అధికారులు పాల్గొన్నారు.

