ఎల్‌నినో ఎఫెక్ట్
మరింత ఆలస్యంగా నైరుతి రుతుపవనాలు
జూన్ 4 లేదా 5 తేదీల్లో కేరళ తీరాన్ని తాకే అవకాశం
మే 26నే వస్తాయన్న ఐఎండీ తొలి అంచనాలు తలకిందులు
శ్రీలంక సగం వరకు వచ్చి నిలిచిపోయిన పవనాలు
జూన్ 5 తర్వాతే తెలంగాణలోకి ప్రవేశం
ఈ వానాకాలంలో సాధారణం కంటే తక్కువ వర్షపాతం నమోదు
జూన్ నెలలో దేశవ్యాప్తంగా సాధారణం కంటే ఎక్కువగా నమోదు కానున్న ఉష్ణోగ్రతలు
యూపీ, బిహార్, హర్యానాతో పాటు తెలుగు రాష్ట్రాల్లోనూ పెరగనున్న వడగాలుల తీవ్రత
కాకతీయ,తెలంగాణ బ్యూరో : దేశవ్యాప్తంగా రైతాంగంతో పాటు ప్రజలంతా ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న నైరుతి రుతుపవనాల రాక ఈసారి మరింత ఆలస్యం కానుంది. జూన్ 4, 5 తేదీల్లో ఇవి కేరళ తీరాన్ని తాకే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ వెల్లడించింది. ఈ నెల 26నే కేరళ తీరాన్ని తాకుతాయని వాతావరణ శాఖ ముందుగా అంచనా వేసినప్పటికీ దానికి భిన్నంగా రుతుపవనాల కదలికలు మందగించాయి. గత ఏడాది మే 24నే కేరళ తీరాన్ని తాకిన నైరుతి రుతుపవనాలు అప్పటి అంచనా కంటే 8 రోజులు ముందే ప్రవేశించాయి. అలాగే 2025లో మే 26 నాటికే తెలంగాణలోకి నైరుతి రుతుపవనాలు ప్రవేశించగా ఈసారి మాత్రం పరిస్థితులు పూర్తిగా మారిపోయాయి. పసిఫిక్ మహాసముద్రంలో ఏర్పడిన ఎల్‌నినో పరిస్థితుల నేపథ్యంలో రుతుపవనాల కదలికల్లో వేగం పూర్తిగా తగ్గింది. ఇప్పటి వరకు హిందూ మహాసముద్రం, బంగాళాఖాతంలో విస్తరిస్తూ వచ్చిన పవనాలు శ్రీలంక సగం వరకు వచ్చి నిలిచిపోయాయి. ఈ ఏడాది వానాకాలంలో దేశవ్యాప్తంగా సాధారణం కన్నా తక్కువ వర్షపాతం నమోదయ్యే అవకాశాలు ఉన్నాయని ఇప్పటికే భారత వాతావరణ శాఖ స్పష్టం చేసింది. సాధారణంగా అయితే మే నెల చివరికల్లా తెలంగాణ రాష్ట్రాన్ని రుతుపవనాలు చేరుకోవాల్సి ఉంది. కానీ ప్రస్తుత పరిస్థితుల్లో జూన్ 5వ తేదీ నుంచి 10వ తేదీ మధ్య వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. దీనివల్ల జూలై, ఆగస్టు, సెప్టెంబరు నెలల వర్షాలపై తీవ్ర ప్రభావం పడే ప్రమాదం ఉందని నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
సాధారణం కంటే ఎక్కువ ఉష్ణోగ్రతలు
నైరుతి రుతుపవనాల ఆలస్యం అలా ఉండగా జూన్ నెలలో చాలా ప్రాంతాల్లో సాధారణం కంటే అధిక ఉష్ణోగ్రతలు నమోదవుతాయని వాతావరణ శాఖ అంచనా వేసింది. దేశంలోని చాలా ప్రాంతాల్లో గరిష్ఠ, కనిష్ఠ ఉష్ణోగ్రతలు ఎక్కువగా ఉండే అవకాశం ఉందని వాతావరణ శాఖ డైరెక్టర్ జనరల్ డాక్టర్ మృత్యుంజయ్ తెలిపారు. ఉత్తర్ ప్రదేశ్, పంజాబ్, బిహార్, ఒడిశా, హర్యానా, ఛత్తీస్ గఢ్, గుజరాత్, ఆంధ్రప్రదేశ్ లలో సాధారణం కంటే ఎక్కువగా వడగాలులు వీచే అవకాశం ఉంది. మహారాష్ట్ర, తెలంగాణ, తమిళనాడులోని కొన్ని ప్రాంతాలలో కూడా వడగాలుల తీవ్రత పెరగనుంది. జూన్ నాటికి ఎల్‌నినో పరిస్థితులు స్పష్టంగా ఏర్పడే అవకాశం 82 శాతంగా ఉందని, జూలై, ఆగస్టు నాటికి ఇది 90 శాతానికి పైగా చేరుతుందని అధికారులు పేర్కొన్నారు. అయితే ఈసారి రుతుపవనాలు సాధారణంగా మే 16నే అండమాన్ నికోబార్ దీవుల్లోకి ప్రవేశించాయి. దేశవ్యాప్తంగా మే నెలలో వర్షపాతం సాధారణం కంటే 4 శాతం ఎక్కువగా నమోదైనట్లు వాతావరణ శాఖ తెలిపింది. మే 27 వరకు నమోదైన మొత్తం రుతుపవన వర్షపాతం సాధారణం కంటే 1 శాతం అధికంగా ఉందని మృత్యుంజయ్ పేర్కొన్నారు. వచ్చే వారంలోగా కేరళ, ఈశాన్య రాష్ట్రాల్లోకి ప్రవేశించడానికి పరిస్థితులు అనుకూలంగా మారుతాయని అధికారులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.

