ఎంజీఎంను కార్పొరేట్ స్థాయికి తీర్చిదిద్దుతాం
బయోమెట్రిక్ హాజరు విధానాన్ని ఖచ్చితంగా అమలు చేయాలి
ఉచిత మందులు.. ల్యాబ్ సేవలందిచాలి
ఆసుపత్రి అభివృద్ధికి దాతల సహకారం ఎంతో అవసరం
వైద్య పరికరాలు అందించిన ఇనగాల సేవలు అభినందనీయం
ఆసుపత్రి అభివృద్ధి కమిటీ సమావేశంలో మంత్రి కొండా సురేఖ
కాకతీయ, హనుమకొండ : వరంగల్‌లోని మహాత్మా గాంధీ మెమోరియల్ (ఎంజీఎం) ఆసుపత్రిని కార్పొరేట్ స్థాయికి తీర్చిదిద్దడమే ప్రభుత్వ లక్ష్యమని రాష్ట్ర అటవీ పర్యావరణ దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ స్పష్టం చేశారు. ఆసుపత్రిలో సిబ్బంది నిర్లక్ష్యంపై ఆమె తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. బుధవారం ఎంజీఎం ఆసుపత్రి అభివృద్ధి వైద్య సేవల నాణ్యత మెరుగుదల మౌలిక వసతుల సమీక్ష కోసం ఆసుపత్రి అభివృద్ధి కమిటీ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో వరంగల్ ఎంపీ కడియం కావ్య, కుడా చైర్మన్ ఇనగాల వెంకట్రామ్ రెడ్డి, వర్ధన్నపేట ఎమ్మెల్యే కేఆర్ నాగరాజు, వరంగల్ జిల్లా కలెక్టర్ డాక్టర్ సత్య శారద, హనుమకొండ కలెక్టర్ చాహత్ బాజ్‌పాయ్, ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ హరిచంద్రారెడ్డి పాల్గొన్నారు.
ఉచిత ల్యాబ్ సేవలు
ఆసుపత్రిలో సిబ్బంది హాజరు వైద్య సేవలు మౌలిక వసతులు పరికరాల అవసరాలపై ఈ సమావేశంలో సమీక్షించారు. బయోమెట్రిక్ హాజరు విధానాన్ని కచ్చితంగా అమలు చేయాలని పేద రోగులకు ఉచిత మందులు ల్యాబ్ సేవలు నిరంతరాయంగా అందించాలని మంత్రి కొండా సురేఖ అధికారులను ఆదేశించారు. ఎమర్జెన్సీ ఐసీయూ విభాగాలకు అవసరమైన కొత్త వైద్య పరికరాల కొనుగోలు ఆసుపత్రి ప్రాంగణ పరిశుభ్రత డ్రైనేజీ సమస్యల పరిష్కారం తాగునీటి సదుపాయాల మెరుగుదలపై నిర్ణయాలు తీసుకున్నారు. రోగుల సహాయ సేవల విస్తరణ స్ట్రెచర్లు వీల్‌చైర్ల అందుబాటు ఆయుష్మాన్ భారత్ డిజిటల్ మిషన్ నమోదు ప్రక్రియ సులభతరంపై చర్చించారు.
వైద్య పరికరాల సమీక్ష
ఇనగాల ఛారిటబుల్ ట్రస్ట్ ద్వారా ఎంజీఎం ఆసుపత్రికి గతంలో అందించిన 65.87 లక్షల రూపాయల విలువైన 41 అత్యాధునిక వైద్య పరికరాల వినియోగాన్ని ప్రత్యేకంగా సమీక్షించారు. పోర్టబుల్ ఎక్స్‌రే యంత్రాలు ఈసీజీ మెషిన్లు సీపాప్ పరికరాలు సిరంజ్ పంపులు పల్స్ ఆక్సిమీటర్లు తదితర పరికరాలు రోగులకు ఎంతో ఉపయోగపడుతున్నాయని అధికారులు తెలిపారు. ఆసుపత్రి అభివృద్ధికి విశేష సహకారం అందించినందుకు కుడా చైర్మన్ ఇనగాల వెంకట్రామ్ రెడ్డిని వరంగల్ జిల్లా కలెక్టర్ డాక్టర్ సత్య శారద ప్రత్యేకంగా అభినందించారు. ప్రభుత్వ ఆసుపత్రుల బలోపేతానికి దాతల సహకారం ఎంతో అవసరమని పేర్కొన్నారు. ఈ సమావేశంలో వివిధ విభాగాల అధిపతులు ఆర్‌ఎంఓలు హెచ్‌డీఎస్ సభ్యులు పాల్గొన్నారు.

