ఇది ప్రగల్బాల ప్రభుత్వం
అభివృద్ధికి కాదు.. అబద్ధాలాకే ఈ ప్రభుత్వం ప్రాధాన్యం
కేంద్ర నిధులతో కట్టి.. ఇందిరమ్మ ఇళ్లుగా అబద్ధపు ప్రచారం
యాసంగిలో ధాన్యం కొనుగోళ్లలో ప్రభుత్వం విఫలం
మొదటి నెలలోనే రూ.11 వేల కోట్ల అప్పు తెచ్చుకున్నారు
రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై బహిరంగ చర్చకు సిద్ధం
సీఎం రేవంత్‌రెడ్డికి బీజేపీ శాసనసభాపక్ష నేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి సవాల్
కాకతీయ, హైదరాబాద్ : తెలంగాణలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేతృత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం వాస్తవాలను పక్కనబెట్టి అబద్ధాలు ప్రగల్భాలకే ఎక్కువ ప్రాధాన్యం ఇస్తోందని బీజేపీ శాసనసభాపక్ష నేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి తీవ్రస్థాయిలో మండిపడ్డారు. బుధవారం బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు ప్రతి సందర్భంలోనూ కేంద్ర ప్రభుత్వాన్ని బీజేపీని లక్ష్యంగా చేసుకుని ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారని విమర్శించారు. ముఖ్యమంత్రి తన మంత్రివర్గంతో కలిసి ధాన్యం కొనుగోళ్లు ఇందిరమ్మ ఇళ్లు ప్రాజెక్టులు రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై బహిరంగ చర్చకు రావాలని సవాల్ విసిరారు.
ధాన్యం కొనుగోళ్లలో ఘోర వైఫల్యం
రాష్ట్రంలో యాసంగి సీజన్‌లో సుమారు 1.41 కోట్ల మెట్రిక్ టన్నుల ధాన్యం ఉత్పత్తి కాగా కాంగ్రెస్ ప్రభుత్వం కేవలం 64 లక్షల మెట్రిక్ టన్నుల కొనుగోలుకే పరిమితమైందని విమర్శించారు. దేశంలో కేంద్రం కొనుగోలు చేసే వడ్లలో 60 శాతం తెలంగాణ నుంచే కొనుగోలు చేస్తోందని గుర్తు చేశారు కేవలం ధాన్యం మాత్రమే కాకుండా మొక్కజొన్న జొన్న సన్‌ఫ్లవర్ కొనుగోళ్లలోనూ ప్రభుత్వం విఫలమైందన్నారు ఇప్పటికే 2400 సెంటర్లు మూసేశారని మండిపడ్డారు. రాష్ట్ర ప్రభుత్వం చివరి గింజ వరకు ధాన్యం కొనుగోలు చేయకపోతే రైతుల ధాన్యం తీసుకువచ్చి ముఖ్యమంత్రి ఇంటి ముందు పోస్తామని హెచ్చరించారు.
కేంద్ర నిధులతోనే ఇందిరమ్మ ఇళ్లు
గృహ నిర్మాణం విషయంలో ప్రభుత్వం ప్రజలను మోసంచేస్తోందని లక్ష ఇళ్ల నిర్మాణం జరిగిందన్న వాదన అవాస్తవమన్నారు. గత బడ్జెట్‌లో గృహ నిర్మాణానికి కేటాయించిన 7000 కోట్ల రూపాయలలో 4644 కోట్ల రూపాయలు కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన నిధులేనని తెలిపారు. కేంద్రం ఇచ్చిన నిధులతోనే ఇళ్లు నిర్మించి వాటికి ఇందిరమ్మ ఇళ్లు అని పేరు పెట్టుకోవడం ప్రజలను మోసంచేయడమేనన్నారు ప్రాణహిత తుమ్మిడిహెట్టి ప్రాజెక్టుల విషయంలో కేంద్ర అనుమతుల ప్రక్రియ పూర్తి చేయకుండా కేంద్రంపై నెపం మోపుతున్నారని విమర్శించారు. రాష్ట్రానికి ఉన్న ఎఫ్‌ఆర్‌బీఎం పరిమితి 58 వేల కోట్ల రూపాయలు అయితే కేవలం మొదటి నెలలోనే రేవంత్ రెడ్డి ప్రభుత్వం 11 వేల కోట్ల రూపాయల అప్పు తెచ్చుకుందని ధ్వజమెత్తారు అప్పు తెచ్చుకుంటే గానీ ప్రభుత్వ ఉద్యోగులకు జీతాలు ఇవ్వలేని దారుణమైన పరిస్థితి ఉందన్నారు. ప్రతి వారం 2500 కోట్ల రూపాయల నిధుల కొరత ఉందని స్వయంగా ఆర్థిక మంత్రే చెబుతున్నారని గుర్తు చేశారు. రాష్ట్రాన్ని ఇంతలా సర్వనాశనం చేసిన రేవంత్ రెడ్డి వెంటనే తన పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు రాష్ట్ర పునర్నిర్మాణం కేవలం బీజేపీతోనే సాధ్యమని మహేశ్వర్ రెడ్డి స్పష్టం చేశారు.

