ఎవరి కులం ఎంతో… వారికంత వాటా
: భారీ బహిరంగ సభ కరపత్రం ఆవిష్కరణ
కాకతీయ మలహర్: ధర్మ సమాజ్ పార్టీ మద్దతుతో, బీసీ, ఎస్సీ, ఎస్టీ-జేఏసీ ఆధ్వర్యంలో ఈ నెల 26న భూపాలపల్లి జిల్లా కేంద్రంలో నిర్వహించనున్న భారీ బహిరంగ సభకు సంబంధించిన కరపత్రాలను నిర్వాహకులు ఆవిష్కరించారు. ‘సామాజిక న్యాయం – రాజ్యాధికారం’ లక్ష్యంగా ఈ సభను నిర్వహిస్తున్నట్లు వారు ప్రకటించారు. ఈ సందర్భంగా బీసీ, ఎస్సీ, ఎస్టీ-జేఏసీ భూపాలపల్లి జిల్లా కన్వీనర్ రాదండి దేవేందర్, కో-ఆర్డినేటర్ కొత్తూరి రవీందర్ మాట్లాడుతూ, రాష్ట్రంలోని వెనుకబడిన వర్గాల ప్రజలు సామాజిక న్యాయం, రాజకీయ భాగస్వామ్యం కోసం ఐక్యంగా పోరాడాల్సిన సమయం ఆసన్నమైందని పేర్కొన్నారు. భారత రాజ్యాంగం అమలులోకి వచ్చిన తర్వాత వెనుకబడిన వర్గాల జీవితాల్లో కొంత మార్పు వచ్చినప్పటికీ, ఇప్పటికీ పూర్తి స్థాయి సామాజిక, ఆర్థిక, రాజకీయ సాధికారత అందలేదని వారు ఆవేదన వ్యక్తం చేశారు. బీసీ, ఎస్సీ, ఎస్టీ వర్గాలకు వారి జనాభాను బట్టి అవకాశాలు దక్కాలని, జనాభా దామాషా ప్రకారం రాజ్యాధికారంలో వాటా కల్పించాలని వారు డిమాండ్ చేశారు. ప్రజల్లో చైతన్యం కల్పించే ఉద్దేశంతో రాష్ట్రవ్యాప్తంగా చేపట్టిన కార్యక్రమాల్లో భాగంగానే ఈ బహిరంగ సభను నిర్వహిస్తున్నామని, ఈ సభను విజయవంతం చేయడానికి అన్ని వర్గాల ప్రజలు, ప్రజాస్వామ్యవాదులు పెద్ద సంఖ్యలో తరలిరావాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో జేఏసీ జిల్లా కో-కన్వీనర్లు అజ్మీరా సమ్మయ్య నాయక్, జోగుల సమ్మయ్య, పులిగంటి రాములు తదితరులు పాల్గొన్నారు.

