కొత్త పీఆర్సీ వెంటనే అమలు చేయాలి
ముందస్తు కోతలు విధించడం అన్యాయం
పీఆర్సీ అమలులో జాప్యం చేయడం ప్రభుత్వ నిర్లక్ష్యానికి నిదర్శనం
: టాప్ర జిల్లా అధ్యక్షుడు చందుపట్ల జనార్దన్
కాకతీయ, కరీంనగర్/హుజూరాబాద్ : రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లకు ఈహెచ్‌ఎస్ (ఎంప్లాయీస్ హెల్త్ స్కీమ్)తో పాటు నూతన పీఆర్సీని తక్షణమే అమలు చేయాలని తెలంగాణ ఆల్ పెన్షనర్స్ అండ్ రిటైర్డ్ పర్సన్స్ అసోసియేషన్ (టాప్ర) కరీంనగర్ జిల్లా అధ్యక్షుడు చందుపట్ల జనార్దన్ డిమాండ్ చేశారు. హుజూరాబాద్‌లోని టాప్ర కార్యాలయంలో యూనిట్ అధ్యక్షుడు భారత ప్రభాకర్ అధ్యక్షతన నిర్వహించిన సమావేశంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. ఉద్యోగులు, పెన్షనర్ల ఆరోగ్య పథకానికి సంబంధించి స్పష్టమైన మార్గదర్శకాలు జారీ చేయకుండానే ముందస్తు కోతలు విధించడం అన్యాయమని ఆయన విమర్శించారు. సంబంధిత ఉత్తర్వులు లేకుండానే ఫైనాన్స్ శాఖ అధికారులు మినహాయింపులు చేపట్టడం చట్ట విరుద్ధమని అన్నారు. ఈహెచ్‌ఎస్ అమలుకు సంబంధించిన పూర్తి విధివిధానాలు ప్రకటించిన తర్వాతే కోతలను కొనసాగించాలని ప్రభుత్వాన్ని కోరారు. పీఆర్సీ అంశంలో ఉద్యోగ సంఘాలతో జరిగిన చర్చల్లో నెల రోజుల్లో నివేదిక తెప్పించి అమలు చేస్తామని హామీ ఇచ్చినా, ఇప్పటివరకు ఎలాంటి పురోగతి లేకపోవడం ప్రభుత్వ నిర్లక్ష్యానికి నిదర్శనమని పేర్కొన్నారు. పీఆర్సీ నివేదికను వెంటనే స్వీకరించి 2023 జూలై నుంచి అమలులోకి తీసుకురావాలని డిమాండ్ చేశారు. అలాగే పెండింగ్‌లో ఉన్న డీఏ బకాయిలను విడుదల చేయడంతో పాటు పెన్షనర్ల బిల్లులు, ఇతర పెండింగ్ చెల్లింపులకు నిధులు మంజూరు చేయాలని కోరారు. ఈ సమావేశంలో చీకట్ల సమ్మయ్య, మండల వీరస్వామి, బొంగోని వెంకటయ్య, తాటిపాముల కనకయ్య, దొంత హరికిషన్, గూడూరి స్వామిరెడ్డి, గాజర్ల బుచ్చిరాజం, శబ్ద ప్రకాశ్, నల్ల రాజిరెడ్డి తదితరులు పాల్గొన్నారు.

