బదిలీపై వెళ్తున్న వైద్యురాలికి ఘన వీడ్కోలు
* భావోద్వేగానికి లోనైనా వైద్యురాలు దీపాంజలి
కాకతీయ,జగదేవ్ పూర్: స్థానిక జగదేవ్ పూర్ మండలంలోని ఇటిక్యాల గ్రామంలో 12 ఏళ్లుగా ఆయుర్వేద వైద్యురాలిగా సేవలు అందించిన వైద్యురాలు దీపాంజలి బదిలీపై సిద్దిపేట జిల్లా చిన్నకోడూరు మండలంలోని అల్లీపూర్ ప్రాంతానికి వెళ్లనున్న నేపథ్యంలో గ్రామ ప్రజలు ఘనంగా వీడ్కోలు సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆసుపత్రి సిబ్బంది, ప్రజాప్రతినిధులు, గ్రామస్థులు ఆమెకు శాలువాతో సత్కరించి జ్ఞాపికలు అందజేస్తూ ఘనంగా వీడ్కోలు పలికారు. ఎన్నో సంవత్సరాలుగా ప్రజలకు నాణ్యమైన వైద్య సేవలు అందిస్తూ, రోగులు, గ్రామ ప్రజల మన్ననలు పొందిన ఆమె బదిలీ నేపథ్యంలో ఏర్పాటు చేసిన వీడ్కోలు సభలో పలువురు మాట్లాడారు.
వైద్యురాలు తన సేవా కాలంలో ప్రజల ఆరోగ్య సంరక్షణకు విశేష కృషి చేశారని, ఆమె సేవలను గ్రామస్తులు ఎప్పటికీ మరువలేరని కొనియాడారు.ఈ సందర్బంగా వైద్యురాలు దీపాంజలి మాట్లాడుతూ ప్రజలు చూపిన ప్రేమ, ఆదరణను జీవితాంతం గుర్తుంచుకుంటానని భావోద్వేగంగా తెలిపారు.
భావోద్వేగానికి లోనైనా వైద్యురాలు
వీడ్కోలు సభలో గ్రామ ప్రజలు, సహచర సిబ్బంది చూపిన ప్రేమాభిమానాలకు వైద్యురాలు దీపాంజలి భావోద్వేగానికి గురయ్యారు. తన సేవా కాలంలో అందరి సహకారం వల్లే ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించగలిగానని తెలిపారు. గ్రామ ప్రజలతో ఏర్పడిన అనుబంధాన్ని ఎప్పటికీ మరువలేనని, వారి ఆదరణ తనకు జీవితాంతం గుర్తుండిపోతుందని పేర్కొన్నారు. ప్రసంగం సందర్భంగా ఆమె కంటతడి పెట్టడంతో సభలో ఉన్నవారు కూడా భావోద్వేగానికి లోనయ్యారు. ప్రజలు ఆమె భవిష్యత్ జీవితంలో మరిన్ని విజయాలు సాధించాలని ఆకాంక్షిస్తూ శుభాకాంక్షలు తెలిపారు.ఈ కార్యక్రమంలో, గ్రామ సర్పంచ్ దీనా రాజలింగం, మాజీ జడ్పీటీసీ చెరుకు లక్ష్మారెడ్డి,గ్రామ మాజీ సర్పంచ్ చంద్రశేఖర్ గుప్త, పంచాయతీ కార్యదర్శి రేఖ, గ్రామ పెద్దలు, ఆరోగ్య శాఖ సిబ్బంది, ఆశా కార్యకర్తలు, గ్రామస్తులు పాల్గొన్నారు.

