నెంబర్ ప్లేట్ లేని వాహనాలపై కొరడా
38 వాహనాలపై ట్రాఫిక్ పోలీసుల చర్యలు
వరంగల్, కాజీపేట పరిధిలో ప్రత్యేక డ్రైవ్
నిబంధనలు పాటించని వాహనదారులకు జరిమానాలు
10 వాహనాలను డిటైన్ చేసిన పోలీసులు
నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరిక
కాకతీయ, కాజీపేట : వరంగల్, కాజీపేట పట్టణ పరిధిలో నెంబర్ ప్లేట్ లేకుండా, రిజిస్ట్రేషన్ లేకుండా సంచరిస్తున్న వాహనాలపై ట్రాఫిక్ పోలీసులు ప్రత్యేక నిఘా చేపట్టారు. ట్రాఫిక్ డీసీపీ రాయల ప్రభాకర్ రావు, ట్రాఫిక్ ఏసీపీ సత్యనారాయణ ఆదేశాల మేరకు కాజీపేట ట్రాఫిక్ సీఐ వెంకన్న ఆధ్వర్యంలో ఎస్సైలు సంపత్, మంగ సిబ్బంది జూన్ 12, 13 తేదీల్లో ప్రత్యేక డ్రైవ్ నిర్వహించారు. ఈ తనిఖీల్లో సుమారు 28 నెంబర్ ప్లేట్ లేని వాహనాలను గుర్తించి, సంబంధిత వాహనదారులకు చలాన్లు విధించారు. అనంతరం నెంబర్ ప్లేట్లు తెప్పించి వాహనాలకు అమర్చించిన తర్వాతే వాటిని విడుదల చేశారు. అదేవిధంగా రిజిస్ట్రేషన్ లేని 10 ద్విచక్ర వాహనాలను పోలీసులు డిటైన్ చేశారు. ఈ సందర్భంగా ట్రాఫిక్ పోలీసులు వాహనదారులకు హెచ్చరిక జారీ చేశారు. వరంగల్, కాజీపేట పట్టణ పరిధిలో ఇకపై నెంబర్ ప్లేట్ సరిగా లేకపోయినా, అసలు లేకపోయినా, అలాగే రిజిస్ట్రేషన్ లేకుండా వాహనాలు నడిపినా చట్టపరంగా కఠిన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. వాహనదారులు తప్పనిసరిగా చెల్లుబాటు అయ్యే రిజిస్ట్రేషన్ పత్రాలు కలిగి ఉండాలని, నిబంధనల ప్రకారం నెంబర్ ప్లేట్లు అమర్చుకోవాలని, ట్రాఫిక్ నియమాలను పాటించి సురక్షిత రవాణాకు సహకరించాలని అధికారులు విజ్ఞప్తి చేశారు.

