కొట్టే హక్కు సీఐకి ఎవరు ఇచ్చారు?
అశ్వాపురం సీఐ అశోక్ రెడ్డిపై అట్రాసిటీ కేసు నమోదు చేయాలి
ఆదివాసి జేఏసీ డిమాండ్
కాకతీయ, అశ్వాపురం: మండల పరిధిలో ఆదివాసి యువకుడిపై అశ్వాపురం సీఐ అశోక్ రెడ్డి దాడికి పాల్పడటాన్ని ఆదివాసి జేఏసీ నాయకుడు పొడియం అనిల్ కుమార్ తీవ్రంగా ఖండించారు. బాధితుడిపై దాడి చేసిన సీఐపై ఎస్సీ, ఎస్టీ (అత్యాచారాల నిరోధక) చట్టం కింద కేసు నమోదు చేసి, శాఖాపరమైన చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. సర్వాయిపాడు బంజర గ్రామానికి చెందిన కోయ గిరిజన యువకుడు తంగేళ్ల కళ్యాణ్, తన ఇంటి అవసరాల నిమిత్తం ఖాళీ ట్రాక్టర్‌తో ఇసుక తెచ్చుకునేందుకు శనివారం సాయంత్రం వెళ్తున్నాడు. చింతిరియాల సమీపంలో అతడిని అడ్డగించిన సీఐ అశోక్ రెడ్డి, ఎలాంటి కేసు నమోదు చేయకుండానే విచక్షణారహితంగా దాడికి పాల్పడ్డారని అనిల్ కుమార్ ఆరోపించారు. చట్టాన్ని అమలు చేయాల్సిన అధికారి అధికార అహంకారంతో ప్రవర్తించడం దారుణమని విమర్శించారు.
ఆత్మహత్యాయత్నం వరకు..
“అక్రమ ఇసుక రవాణా జరిగితే చట్టప్రకారం చర్యలు తీసుకోవాలి కానీ, ఆదివాసి యువకుడిని కొట్టే హక్కు మీకు ఎవరు ఇచ్చారు?” అని అనిల్ కుమార్ ప్రశ్నించారు. సీఐ దాడితో తీవ్ర మనస్తాపానికి గురైన కళ్యాణ్ ఆత్మహత్యాయత్నానికి పాల్పడే స్థితికి వెళ్లగా, తాము సమయానికి స్పందించి కాపాడామని తెలిపారు. దాడి సమయంలో సీఐ కులం పేరుతో దూషించి, అవమానకర పదజాలం ఉపయోగించారని ఆరోపించారు. కాకీ దుస్తులు వేసుకున్నంత మాత్రాన చట్టం చేతిలోకి రాదని హెచ్చరించిన ఆయన, జిల్లా మరియు రాష్ట్ర స్థాయి పోలీసు ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేస్తామని, న్యాయం జరిగే వరకు పోరాటం కొనసాగిస్తామని స్పష్టం చేశారు. ఈ ఘటనపై జిల్లా వ్యాప్తంగా ఆదివాసి సంఘాలు, గిరిజన హక్కుల పరిరక్షణ సంస్థలు తీవ్ర నిరసన వ్యక్తం చేస్తున్నాయి.

