నా సోదరి కనిపించడం లేదు
పోలీసులకు గద్వాల విజయలక్ష్మి ఫిర్యాదు
జూన్ 4న ఉదయం నుంచి కె.నమ్రత అదృశ్యం
ముగ్గురు వ్యక్తులపై అనుమానం వ్యక్తం చేస్తూ బంజారాహిల్స్ పీఎస్‌లో ఫిర్యాదు
కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టిన పోలీసులు
కాకతీయ, హైదరాబాద్ : తెలంగాణ మహిళా కమిషన్ చైర్మన్, మాజీ మేయర్ గద్వాల విజయలక్ష్మి సోదరి కె.నమ్రత (57) అదృశ్యమయ్యారు. ఈ మేరకు విజయలక్ష్మి బంజారాహిల్స్ పోలీసులకు ఫిర్యాదు చేశారు.
గద్వాల విజయలక్ష్మి పోలీసులకు అందించిన వివరాల ప్రకారం.. బంజారాహిల్స్ రోడ్ నంబర్ 12లో నివసించే నమ్రత ఈ నెల 4వ తేదీన ఉదయం 10 గంటలకు ఇంట్లో నుంచి బయటకు వెళ్లారు. అయితే, అప్పటి నుంచి ఆమె తిరిగి రాకపోవడంతో కుటుంబ సభ్యులు ఆందోళనకు గురయ్యారు. ఎక్కడెక్కడ వెతికినా ఫలితం లేకపోవడంతో, చివరకు ఆమె అదృశ్యమైనట్లు విజయలక్ష్మి పోలీసులకు ఫిర్యాదు చేశారు.
ఈ అదృశ్యం వెనుక సతీష్, సత్యనారాయణ మరియు కుమారి అనే వ్యక్తుల ప్రమేయం ఉండవచ్చని, వారిపై తమకు అనుమానంగా ఉందని గద్వాల విజయలక్ష్మి తన ఫిర్యాదులో పేర్కొన్నారు. ఈ ఫిర్యాదును స్వీకరించిన బంజారాహిల్స్ పోలీసులు కేసు నమోదు చేశారు. ప్రస్తుతం పోలీసులు సదరు వ్యక్తులను విచారించడంతో పాటు, నమ్రత కోసం గాలింపు చర్యలు ముమ్మరం చేశారు. ఈ ఘటన నగరంలో చర్చనీయాంశంగా మారింది.

