ఎస్‌ఐఆర్ సర్వేను పారదర్శకంగా చేపట్టాలి
నిర్ణీత గడువులోగా సర్వేను పూర్తి చేయాలి
ఎలాంటి పొరపాట్లు లేకుండా జాగ్రత్త వహించాలి
దుగ్గొండి తహసీల్దార్ సమ్మక్క
కాకతీయ, దుగ్గొండి: ఎస్‌ఐఆర్ సర్వే ప్రక్రియను బూత్ లెవల్ ఆఫీసర్లు (బీఎల్‌వోలు) అత్యంత బాధ్యతాయుతంగా, పారదర్శకంగా నిర్వహించాలని దుగ్గొండి తహసీల్దార్ సమ్మక్క సూచించారు. మండల కేంద్రంలోని రైతు వేదికలో బీఎల్‌వోల కోసం నిర్వహించిన శిక్షణ శిబిరంలో ఆమె ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. సర్వే నిర్వహణలో భాగంగా ప్రతి ఇంటిని సందర్శించి అర్హుల వివరాలను క్షుణ్ణంగా నమోదు చేయాలని ఆమె ఆదేశించారు. ప్రభుత్వ మార్గదర్శకాలపై ప్రజలకు అవగాహన కల్పిస్తూ, సమాచారాన్ని నిబంధనల మేరకు నమోదు చేయాలన్నారు. సర్వేలో ఏమాత్రం నిర్లక్ష్యం వహించకూడదని, అధికారులు, సిబ్బంది సమన్వయంతో పనిచేయాలని సూచించారు. ఏదైనా సందేహం ఉంటే వెంటనే ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లాలని తెలిపారు. ప్రభుత్వ ప్రణాళికల రూపకల్పనకు ఈ సర్వే కీలకమని, అందువల్ల సమాచార సేకరణలో ఖచ్చితత్వానికి ప్రాధాన్యం ఇవ్వాలని ఆమె నొక్కి చెప్పారు. శిక్షణలో భాగంగా సర్వే నిర్వహణ విధానం, వివరాల నమోదు, ఫారాల పరిశీలన మరియు నివేదికల సమర్పణపై బీఎల్‌వోలకు అవగాహన కల్పించారు. కార్యక్రమంలో ఏఆర్ఐ మల్లయ్య, జూనియర్ అసిస్టెంట్లు రంజిత్, రాజేందర్, సూపర్‌వైజర్లు మరియు బీఎల్‌వోలు పాల్గొన్నారు.

