11 గంటలైనా ఒక్కరే
బల్దియా అధికారుల ఆలస్యంతో ప్రజల పడిగాపులు
బైఠాయించి 29వ డివిజన్ ప్రజల నిరసన
వినతులు సమర్పించేందుకు వచ్చిన 64 మంది
గ్రీవెన్స్‌కు సమయపాలన పాటించని అధికారులు
గ్రేటర్ అధికారుల తీరుపై తీవ్ర విమర్శలు
కాకతీయ, వరంగల్ ప్రతినిధి : వరంగల్ మహానగర పాలక సంస్థ (బల్దియా) అధికారులు రాజకీయ నాయకులను మించిపోతున్నారంటూ ప్రజలు తీవ్ర విమర్శలు గుప్పిస్తున్నారు. ప్రతి సోమవారం ఉదయం 10:30 గంటలకు ప్రారంభం కావాల్సిన గ్రీవెన్స్ సెల్‌కు అధికారులు సమయానికి రాకపోవడంతో వినతులతో వచ్చిన జనం అసహనంతో ఊగిపోయారు. 11 గంటలవుతున్నా కేవలం ఇన్‌చార్జ్ సీపీ రవీంద్ర డి. రాడేకర్ మాత్రమే హాజరుకావడంతో, మిగిలిన అధికారుల తీరుపై ప్రజలు కౌన్సిల్ హాల్‌లోనే అధికారుల టేబుల్ ఎదుట బైఠాయించి నిరసనకు దిగారు.
వారం రోజులుగా నీటి సరఫరా బంద్
తమ డివిజన్‌లో వారం రోజులకు పైగా నీటి సరఫరా నిలిచిపోయిందని అర్జీ సమర్పించేందుకు 29వ డివిజన్ ప్రజలు పెద్ద సంఖ్యలో కౌన్సిల్ హాల్‌లోకి చేరుకున్నారు. అయితే, ఆ సమయానికి ఇంజినీరింగ్ విభాగం అధికారులు ఒక్కరు కూడా లేకపోవడంతో ప్రజలు అవాక్కయ్యారు. అధికారుల ఆలస్యంపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఆందోళన చేపట్టారు. అనంతరం సమాచారం అందుకున్న అధికారులు కాస్త ఆలస్యంగా వచ్చి.. వారి వినతులు స్వీకరించి, సమస్య పరిష్కరిస్తామని హామీ ఇవ్వడంతో నిరసన విరమించారు. సాధారణంగా ఫీల్డ్ విజిట్ పేరిట బల్దియా అధికారులు ఆఫీసుకు ఆలస్యంగా వస్తుంటారని, గ్రీవెన్స్ రోజు కూడా అడిషనల్ కమిషనర్‌తో సహా ఇతర అధికారులు లేట్‌గా రావడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఈ సోమవారం జరిగిన బల్దియా గ్రీవెన్స్ సెల్‌కు మొత్తం 64 అర్జీలు వచ్చాయి. ఇందులో టౌన్ ప్లానింగ్‌కు 26, ఇంజినీరింగ్ 19, రెవెన్యూ 7, హెల్త్ అండ్ శానిటేషన్ 7, నీటి సరఫరాకు సంబంధించి 5 వినతులు వచ్చాయి. ఆయా వినతులను త్వరితగతిన పరిష్కరించడం కోసం సంబంధిత విభాగాల అధికారులకు సిఫారసు చేశారు.

