రిజిస్ట్రేషన్లలో గందరగోళం
జూనియర్ అసిస్టెంట్లతో రిజిస్ట్రేషన్లు
చెల్లుబాటుపై చట్టపరమైన చిక్కులు?!
కోర్టు హెచ్చరికలున్నా శాఖలో రాని మార్పు
ఉన్నతాధికారుల ఒత్తిడితో జూనియర్ అసిస్టెంట్ల సతమతం
ఉమ్మడి వరంగల్ వ్యాప్తంగా సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో పోస్టులు ఖాళీ
అదనపు బాధ్యతలతో నలిగిపోతున్న సిబ్బంది.. భయాందోళనల్లో ప్రజలు
ఆదాయంపైనే ప్రభుత్వ ఫోకస్.. ఉద్యోగుల సమస్యలపై నిర్లక్ష్యం
కాకతీయ, వరంగల్ బ్యూరో : రాష్ట్ర ఖజానాకు సింహభాగం ఆదాయాన్ని సమకూర్చే రిజిస్ట్రేషన్ శాఖ, ఉమ్మడి వరంగల్ జిల్లాలో అస్తవ్యస్తంగా తయారైంది. సిబ్బంది కొరతను సాకుగా చూపుతూ అధికారిక హోదా లేని జూనియర్ అసిస్టెంట్లతో రిజిస్ట్రేషన్లు చేయించడం ఇప్పుడు శాఖలో పెద్ద చర్చకు, చట్టపరమైన వివాదాలకు దారితీస్తోంది. ప్రభుత్వ ఆదాయం పెంచుకోవడంపై చూపుతున్న శ్రద్ధ, ఆ శాఖను నడిపించే సిబ్బంది నియామకాలపై మాత్రం చూపడం లేదనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
రిజిస్ట్రేషన్ ప్రక్రియకు చట్టబద్ధమైన బాధ్యత. పత్రాల పరిశీలన, పక్షాల గుర్తింపు, స్టాంప్ డ్యూటీ నిర్ధారణ వంటి కీలకమైన బాధ్యతలను నిర్వహించే అధికారం చట్టం కేవలం సబ్ రిజిస్ట్రార్లకు మాత్రమే కల్పించింది. కానీ, ఉమ్మడి వరంగల్ జిల్లాలోని అనేక సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో రెగ్యులర్ అధికారులు లేకపోవడంతో, జూనియర్ అసిస్టెంట్లతో రిజిస్ట్రేషన్లు చేయిస్తున్నారు. గతంలో ఓ భూ వివాదానికి సంబంధించిన కేసులో జూనియర్ అసిస్టెంట్ చేసిన రిజిస్ట్రేషన్ చట్టబద్ధతను న్యాయస్థానం ప్రశ్నించినప్పటికీ, ఉన్నతాధికారులు మాత్రం అదే విధానాన్ని కొనసాగిస్తుండటం ఆశ్చర్యం కలిగిస్తోంది. ఒకవేళ భవిష్యత్తులో ఈ పత్రాలు కోర్టుకు చేరితే, ఆ రిజిస్ట్రేషన్లు రద్దయ్యే ప్రమాదం ఉందని, తద్వారా లక్షలాది రూపాయల విలువైన ఆస్తుల చట్టబద్ధత ప్రశ్నార్థకంగా మారుతుందని న్యాయ నిపుణులు హెచ్చరిస్తున్నారు.

సిబ్బంది కొరత.. నిత్యం నరకం
ఉమ్మడి వరంగల్ జిల్లా పరిధిలోని అనేక కార్యాలయాల్లో సబ్ రిజిస్ట్రార్, సీనియర్ అసిస్టెంట్ పోస్టులు ఖాళీగా ఉన్నాయి. దీనివల్ల ప్రజలు గంటల తరబడి కార్యాలయాల ఎదుట వేచి చూడాల్సిన దుస్థితి ఏర్పడింది. జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో రెండేళ్ల క్రితం ప్రారంభించిన కార్యాలయం, నేటికీ పూర్తిస్థాయి సిబ్బంది లేక ఒక జూనియర్ అసిస్టెంట్‌తోనే నెట్టుకొస్తోంది. పరిపాలనా అవసరాల దృష్ట్యా జిల్లా స్థాయి అధికారులు ప్రొసీడింగ్స్ ఇచ్చి పనులు చేయిస్తున్నామని చెబుతున్నా, ఆ ప్రొసీడింగ్స్‌కు చట్టబద్ధమైన బలం ఎంత అనే దానిపై ఎవరికీ స్పష్టత లేదు. పై అధికారుల ఆదేశాలు అమలు చేయకపోతే చర్యలు తీసుకుంటారని, చేస్తే భవిష్యత్తులో చట్టపరమైన ఇబ్బందులు వస్తాయని జూనియర్ అసిస్టెంట్లు తీవ్ర మానసిక ఒత్తిడికి గురవుతున్నారు. ప్రమోషన్లు లేక, అదనపు బాధ్యతలు మోస్తూ, పైగా చట్టపరమైన చిక్కుల మధ్య వారు నలిగిపోతున్నారు. ఎన్నో ఏళ్లుగా సేవ చేస్తున్నా ప్రమోషన్లు ఇవ్వకపోవడం పట్ల వారు తీవ్ర అసహనంతో ఉన్నారు.
కొత్త డీఆర్ ముందున్న సవాళ్లు
వరంగల్ జిల్లా రిజిస్ట్రార్‌గా బాధ్యతలు చేపట్టనున్న కొత్త అధికారి ముందు అనేక సమస్యలు కొండలా పేరుకుపోయాయి. ఖాళీ పోస్టుల భర్తీ, జూనియర్ అసిస్టెంట్లతో రిజిస్ట్రేషన్ల వ్యవహారంపై చట్టపరమైన స్పష్టత, పెండింగ్ ప్రమోషన్ల పరిష్కారం వంటి అంశాలపై కొత్త డీఆర్ ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటారనేది ఆసక్తికరంగా మారింది. ప్రభుత్వ ఖజానాను నింపుతున్న ఈ శాఖ పట్ల ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి, ఖాళీలను భర్తీ చేయాలని, చట్టపరమైన చిక్కులు రాకుండా పరిపాలనా సంస్కరణలు చేపట్టాలని ప్రజలు, ఉద్యోగులు కోరుతున్నారు. లేనిపక్షంలో, ఈ పరిపాలనా లోపం భవిష్యత్తులో వేలాది ఆస్తుల యజమానులకు శాపంగా మారే అవకాశం ఉంది.

