కేబుల్ బ్రిడ్జికి ‘మట్టి’ గండం!
ర్యాంపు నిర్మాణానికి బురద మట్టి
ప్రశ్నార్థకంగా రూ.204కోట్లతో జరుగుతున్న పనులు
బ్రిడ్జి నిర్మాణంలో లోపాలతో భవిష్యత్‌పై ఆందోళన
రూ.కోట్లు బురదలో పోసినా పన్నీరేనా..? అంటూ విమర్శలు
‘చూసి చూడనట్లు’ వ్యవహరిస్తున్న ఆర్ అండ్ బీ అధికారులు
నాణ్యత లోపం నిజమేనని ఒప్పుకున్న డీఈ భగవాన్
కాకతీయ, ఖమ్మం బ్యూరో : ఖమ్మం నగరానికి మణిహారంగా, ప్రతిష్టాత్మక ప్రాజెక్టుగా భావిస్తున్న కేబుల్ బ్రిడ్జి నిర్మాణంలో నాణ్యత ప్రమాణాలకు తూట్లు పడుతున్నాయి. రూ. 204 కోట్ల భారీ వ్యయంతో జరుగుతున్న ఈ నిర్మాణంలో, ర్యాంపుల కోసం నాసిరకం మట్టిని వాడుతున్నట్లు వస్తున్న ఆరోపణలు నగరవాసుల్లో ఆందోళన కలిగిస్తున్నాయి. మంత్రి తుమ్మల నాగేశ్వరరావు వచ్చే ఏడాది నాటికి బ్రిడ్జిని పూర్తి చేయాలని ఆదేశిస్తుంటే, కాంట్రాక్టర్లు మాత్రం నాణ్యతను గాలికొదిలేసి మట్టి దందాను కొనసాగిస్తున్నారన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
బురద మట్టితో బ్రిడ్జికి ముప్పు?
కేబుల్ బ్రిడ్జి ర్యాంపుల కోసం అత్యంత నాణ్యమైన మట్టి ఖనిజాన్ని వాడాల్సి ఉండగా, అందుకు భిన్నంగా నేషనల్ హైవేలకు వాడే మెత్తటి బురద మట్టిని యథేచ్ఛగా నింపుతున్నారు. నిపుణుల అభిప్రాయం ప్రకారం 70 శాతం చిన్న రాళ్లు, 30 శాతం మెత్తటి మట్టి మిశ్రమం ఉంటేనే ర్యాంపు గట్టిపడి బ్రిడ్జికి పటిష్టత లభిస్తుంది. కానీ ఇక్కడ అందుకు విరుద్ధంగా మెత్తటి మట్టిని నింపడం వల్ల భవిష్యత్తులో బ్రిడ్జి భద్రత ప్రశ్నార్థకంగా మారే ప్రమాదం ఉందని ఇంజనీర్లు హెచ్చరిస్తున్నారు. ఇప్పటికే పక్కనే ఉన్న పాత బ్రిడ్జి బలహీనపడటంతోనే కొత్త కేబుల్ బ్రిడ్జిని నిర్మిస్తున్నారు. అలాంటి ప్రాజెక్టులోనే నాణ్యతను పాటించకపోతే, వందల కోట్ల ప్రజాధనం బురదలో పోసిన పన్నీరులా మారుతుందని ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
అధికారుల నిర్లక్ష్యం.. సాకులతో తప్పించుకుంటున్న వైనం
నిర్మాణ పనులను పర్యవేక్షించాల్సిన ఆర్ అండ్ బీ అధికారులు, కాంట్రాక్టర్ల అక్రమాలకు ఏమాత్రం అడ్డుకట్ట వేయడం లేదు. కళ్ల ముందే నాసిరకం మట్టిని తరలిస్తుంటే, అధికారులు చూసి చూడనట్లు వ్యవహరించడం వెనుక ఆంతర్యమేమిటన్న ప్రశ్నలు వినిపిస్తున్నాయి. ఈ వ్యవహారంపై ఆర్ అండ్ బీ డీఈ భగవాన్‌ను వివరణ కోరగా మొదట నిర్లక్ష్యంగా సమాధానమిచ్చిన ఆయన, ఆ తర్వాత మట్టిలో నాణ్యత లోపాలు ఉన్నట్లు పరోక్షంగా అంగీకరించారు. “సైట్ విజిట్ చేసి, మట్టి తరలింపును నిలిపివేయాలని ఆదేశాలు జారీ చేశాం” అంటూ ఆయన చెప్పుకొచ్చారు.
ప్రజా ఆశయానికి తూట్లు?
భవిష్యత్ తరాలకు ఉపయోగపడేలా, అత్యంత నాణ్యతతో కేబుల్ బ్రిడ్జిని నిర్మించాలనే ప్రభుత్వ ఆశయం, కాంట్రాక్టర్ల కక్కుర్తి వల్ల దెబ్బతింటోంది. గతంలో పువ్వాడ అజయ్ కుమార్ ప్రతిపాదనలతో మొదలైన ఈ ప్రాజెక్టును, ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ముందుకు తీసుకెళ్తోంది. అయితే, క్షేత్రస్థాయిలో జరుగుతున్న తంతు చూస్తుంటే, పనులు పూర్తి కావడమే కానీ నాణ్యత మాత్రం గాలికి కొట్టుకుపోతోందని ప్రజలు విమర్శిస్తున్నారు. ఇప్పటికైనా ఉన్నతాధికారులు జోక్యం చేసుకుని, నాణ్యతా ప్రమాణాలను క్షుణ్ణంగా పరిశీలించాలని, అక్రమాలకు పాల్పడిన కాంట్రాక్టర్లపై, సహకరిస్తున్న అధికారులపై కఠిన చర్యలు తీసుకోవాలని నగరవాసులు డిమాండ్ చేస్తున్నారు.

