ధర్మం తప్పిన దేవాదాయ శాఖ
ఆలయ వేలం పాటల్లో ఏసీబీ నిందితుడి ప్రత్యక్షం
అధికారుల తీరుపై మరిపెడ గ్రామస్తుల తీవ్ర ఆగ్రహం
మహబూబాబాద్ జిల్లా మరిపెడ పరిధిలో ఘటన
ప్రభుత్వ ఉద్యోగిగా ఉంటూ అక్రమ నిర్మాణాలపై ఫిర్యాదు
కాకతీయ, మహబూబాబాద్ : సుప్రసిద్ధ మాకుల శ్రీ వెంకటేశ్వర ఆలయంలో గురువారం నిర్వహించిన ఆలయ వేలం పాట తీవ్ర గందరగోళానికి దారితీసింది. గతంలో గుంజేడు ఆలయంలో రూ.20 వేలు లంచం తీసుకుంటూ అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) అధికారులకు రెడ్ హ్యాండెడ్‌గా దొరికిన అప్పటి ఈవో కేసుకు సంబంధించిన నిందితుడు భిక్షమాచారిని.. ప్రస్తుత అధికారులు పక్కనే కూర్చోబెట్టుకుని వేలంపాట నిర్వహించడం స్థానికంగా తీవ్ర దుమారం రేపింది. దేవాదాయ శాఖ అధికారుల ఉదాసీన వైఖరిపై మరిపెడ గ్రామస్తులు, భక్తులు ఘాటైన విమర్శలు గుప్పించారు. వేలం వేదిక వద్ద గ్రామ పెద్దలు కుడితే వెంకటరెడ్డి, వేర్మరెడ్డి వెంకటరెడ్డి, బుడుగుల రాజు, రేఖ రమేష్ తదితరులు ప్రస్తుత ఈవోను నేరుగా నిలదీశారు. ఏసీబీ కేసులో నిందితుడిగా ఉన్న వ్యక్తిని అధికారిక వేలంలో ఎలా భాగస్వామిని చేస్తారని ఆగ్రహం వ్యక్తం చేశారు. సదరు ఉద్యోగి భిక్షమాచారి మరిపెడ ఆలయంలో విధి నిర్వహణలో ఉన్న సమయంలో తీవ్ర అక్రమాలకు పాల్పడ్డారని గ్రామస్థులు ఆరోపించారు. ప్రభుత్వ నియమ నిబంధనలకు విరుద్ధంగా అక్రమంగా ఇంటి నిర్మాణం చేపట్టడమే కాకుండా, ప్రభుత్వ ఉద్యోగి అయి ఉండి రైతుబంధు పథకం ద్వారా ఆర్థిక లబ్ధి పొందుతూ అధికారులను తప్పుదోవ పట్టించారని ధ్వజమెత్తారు.
ఆలయ వ్యవహారాల్లో జోక్యం
అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న సదరు వ్యక్తి ఆలయ రోజువారీ కార్యక్రమాల్లో నిరంతరం తలదూరుస్తూ, అర్చకుల మధ్య లేనిపోని వివాదాలు సృష్టిస్తున్నారని భక్తులు ఆవేదన వ్యక్తం చేశారు. ఇన్ని అక్రమాలకు పాల్పడుతున్నా ధర్మ రక్షణ చేయాల్సిన దేవాదాయ, ధర్మాదాయ శాఖ అధికారులు అతనిపై ఎలాంటి చర్యలు తీసుకోకపోగా.. పెద్దపీట వేయడం పలు అనుమానాలకు తావిస్తోందని మండిపడ్డారు. ఉన్నతాధికారులు స్పందించి సదరు నిందితుడిపై శాఖాపరమైన కఠిన చర్యలు తీసుకోవాలని, ఆలయ పవిత్రతను కాపాడాలని మరిపెడ ప్రజలు డిమాండ్ చేశారు.

