బీఆర్ఎస్ నాయకులపై అక్రమ కేసులు
మానవ హక్కుల కమిషన్ను ఆశ్రయించిన బాధితులు
2024 నాటి కేసులపై హెచ్ఆర్సీలో వకాలత్ దాఖలు
కాంగ్రెస్ నాయకుల ప్రోద్బలంతోనే అక్రమ కేసులు బనాయించారని ఆరోపణ
కాకతీయ, ఆత్మకూరు: పరకాల నియోజకవర్గంలోని ఆత్మకూరు, దామెర మండలాలకు చెందిన పలువురు బీఆర్ఎస్ నాయకులు తమపై 2024లో నమోదైన కేసులకు సంబంధించి తెలంగాణ రాష్ట్ర మానవ హక్కుల కమిషన్ను ఆశ్రయించారు. శుక్రవారం నాంపల్లిలోని మానవ హక్కుల కమిషన్ కార్యాలయంలో బీఆర్ఎస్ లీగల్ సెల్ న్యాయవాదుల ద్వారా వీరు వకాలత్ దాఖలు చేశారు. అనంతరం బీఆర్ఎస్ నాయకులు మీడియాతో మాట్లాడుతూ, ఫిబ్రవరి 2024లో ఆత్మకూరు పోలీస్ స్టేషన్ పరిధిలో తమపై అక్రమ కేసులు నమోదు చేశారని ఆరోపించారు. కాంగ్రెస్ నాయకుల ప్రోత్సాహంతోనే అప్పట్లో టాస్క్ఫోర్స్ అధికారులు తమపై తప్పుడు కేసులు పెట్టారని వారు పేర్కొన్నారు. కాంతల కేశవ రెడ్డి, జాకిర్ అలీ, నేరెళ్ల కమలాకర్, వంచ సంబరెడ్డి, ఆవుల శ్రీనివాస్, కుస కుమారస్వామి, కాంతల రవీందర్ రెడ్డి, రేవూరి సుధాకర్ రెడ్డి, వేల్పుల గణేష్ మరియు కిషోర్లపై రాజకీయ కక్షసాధింపులో భాగంగానే ఈ కేసులు బనాయించారని వారు ఆవేదన వ్యక్తం చేశారు. తమకు న్యాయం చేయాలని, అక్రమ కేసుల వెనుక ఉన్న వారిపై చర్యలు తీసుకోవాలని వారు మానవ హక్కుల కమిషన్ను కోరారు.

